వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తరపు సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ప్రశాంత్ భూషణ్‌తో పాటు మరో న్యాయవాది రమేశ్ కూడా ఆర్కే తరపు కేసు వాదించారు.
మరీ ముఖ్యంగా మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయించడంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపులను రద్దు చేయాలని ఆళ్ల వేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా జస్టిస్ నారిమన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం టీడీపీ, ఏపీ ప్రభుత్వం, సీఆర్‌డీఏకు నారిమన్ ధర్మాసనం నోటీసులు జారీ చేయడం కీలక పరిణామంగా వైసీపీ భావిస్తోంది.
కాగా టీడీపీకి పర్యావరణ నిబంధనలు ఉల్లఘించి భూకేటాయింపు చేశారంటూ న్యాయస్థానాల్లో పట్టువదలని విక్రమార్కుడిలా ఆళ్ల రామకృష్ణారెడ్డి పోరాడుతున్నారు. ఇదే విషయమై ఆయన గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆర్కే పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆర్కే తరపున ముఖ్యంగా ప్రశాంత్ భూషన్ వాదించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇటీవల కోర్టు ధిక్కరణను ఎదుర్కొన్న ప్రశాంత్ భూషణ్ రూపాయి జరిమానా చెల్లించి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయడాన్ని ఆయన గట్టిగా సమర్థించారు. ఆ లేఖపై అత్యంత నిజాయితీపరులైన రిటైర్డ్ జడ్జీలతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.