సల్మాన్‌ను చంపేస్తామంటూ గ్యాంగ్‌స్టర్ వార్నింగ్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి మ‌రోసారి బెదిరింపులు వ‌చ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్‌ ఖాన్‌కు చంపేస్తామంటూ ఆయన కార్యాలయానికి ఓ బెదిరింపు ఈ-మెయిల్‌…

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి మ‌రోసారి బెదిరింపులు వ‌చ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్‌ ఖాన్‌కు చంపేస్తామంటూ ఆయన కార్యాలయానికి ఓ బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన నటుడి టీం వెంటనే బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్, లారెన్స్ బిష్ణోయ్ సహచరుడు గోల్డీ బ్రార్ త‌రుపున రోహిత్ గార్గ్ అనే వ్యక్తి నుండి బెదిరింపులు వ‌చ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పంజాబ్ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు ప్రధాన సూత్రధారి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్కు బెదిరింపులు రావడంతో ఆయ‌న నివాసం వద్ద వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించారు. గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిఫ్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ గార్గ్లపై  ఐపీసీ 506(2), 120 (బీ) 34 సెక్షన్ ల కింద బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు 

కాగా ఇటీవ‌లే జైలు నుండి ఓ మీడియాతో మాట్లాడిన బిష్ణోయ్ స‌ల్మాన్ చంప‌డ‌మే త‌న జీవిత లక్ష్యమని అని, స‌ల్మాన్ త‌మ గుడికి వెళ్లి క్ష‌మాప‌ణ‌లు కోరితే వ‌దిలేస్తామ‌ని తెల్చిచెప్పారు. బిష్ణోయ్ తెగ ప‌విత్రంగా భావించే కృష్ణజింకలను స‌ల్మాన్ చంపి బిష్ణోయ్‌ల మనోభావాలను దెబ్బతీశారంటూ లారెన్స్‌ బిష్ణోయ్ పేర్కొన్నారు. 

కాగా బిష్ణోయ్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇది మొదటిసారేం కాదు. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ఖాన్‌ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రకటించాడు. గతేడాది పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత కూడా సల్మాన్‌కు బెదిరింపు లేఖ వచ్చింది.