కొన్ని ఓటీటీ సంస్థలు ప్రసారం చేసే వీడియోల్లో అశ్లీల కంటెంట్, అసభ్యకరమైన పదజాలంపై వస్తున్న ఫిర్యాదులపై తాము సీరియస్ గా ఉన్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సృష్టం చేశారు. సృజనాత్మకత పేరుతో అశ్లీలత, బోల్డ్ కంటెంట్ ను సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.
క్రియేటివిటీ కోసమే డిజిటల్ వేదికలకు స్వేచ్చ ఇచ్చామని.. అశ్లీలత, బోల్డ్ కంటెంట్ కోసం కాదని సృష్టం చేశారు. ఓటీటీలు పరిధులు దాటితే ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వెనుకాడదని వార్నింగ్ ఇచ్చారు. ఓటీటీ నిబంధనల్లో మార్పులు తీసుకురావడానికి చర్చిస్తున్నాం అన్నారు.
గతంలో కూడా.. ‘కొన్ని ఓటీటీలు అశ్లీల వీడియోలను ప్రసారం చేస్తున్నాయి. వాటిపై నియంత్రణ ఉండాల్సిందే. సెన్సార్ బోర్డు అనుమతించిన సినిమాలను థియేటర్లలో వీక్షించడం ఇప్పుడు తక్కువైంది. ఓటీటీల ద్వారా అన్నింటినీ (వెబ్ సిరీస్‌లు, సినిమాలు) ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. అలాంటప్పుడు ఆ ప్రసారాలపై నియంత్రణ ఉండాలి' అంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడిన విషయం తెలిసిందే.
ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ పై కొందరు విమర్శలు కురిపిస్తూ అసభ్య పదజాలం, అశ్లీల సన్నివేశాలతో నిండిపోయిందని దుమ్మెత్తిపోశారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను కూడా తక్షణం సెన్సార్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని చాలా మంది డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.