ఇది ఎన్నికల సీజన్. ప్రతి అంశాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోడానికి అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీలో ఇవాళ్టి గొడవ వెనుక కుట్ర ఉందని వైసీపీ అనుమానిస్తోంది. టీడీపీ సభ్యులపై దాడి సీన్ క్రియేషన్ వెనుక మాస్టర్ ప్లాన్ వుందనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ, వైసీపీ సభ్యులు పరస్పరం కొట్టుకున్నారనేది నిజం. ఇలాంటి వారిని ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారనేది వాస్తవం.
దళిత ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై దాడి జరిగిందని, అలాగే సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిని నెట్టేశారని టీడీపీ సభ్యుల ఆరోపణ. అయితే ఈ ఆరోపణలో నిజం లేదని, బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌పై దళిత ఎమ్మెల్యేతో దాడికి చంద్రబాబు కుట్ర చేశారని వైసీపీ ఆరోపణ. గోరంట్ల బుచ్చయ్య చౌదరే తమ సభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ను తోసేశారని వైసీపీ ఎమ్మెల్యేల ప్రధాన ఆరోపణ.
ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ వెంటనే అప్రమత్తం అయ్యారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆయన ఫోన్ చేసి పరామర్శించారట! లోకేశ్ మాట్లాడుతూ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక రాక్షస రాజ్యంలా ఉన్నామా? అనే అనుమానం వస్తోందన్నారు. గోరంట్లపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. చౌదరిపై దాడి దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే బ్లాక్‌డేగా లోకేశ్ అభివర్ణించారు.
అలాగే ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి పై దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకమన్నారు. మరి దళిత ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామికి లోకేశ్ ఎందుకు ఫోన్ చేసి పరామర్శించలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం తన సామాజిక వర్గానికి చెందిన చౌదరిని మాత్రమే పరామర్శించారని, ఇతరులంటే లోకేశ్‌కు చిన్న చూపు అనేందుకు ఈ పరామర్శే నిదర్శనం అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.