కమ్మవారి గురించి ఆర్కే చెప్పిన పచ్చి నిజం

సర్వం నాకిపోతే తప్ప ఒక్కోసారి తత్వం బోధపడదు. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. ఆంధ్రజ్యోతి ఆర్కే ఇన్నాళ్లకి కమ్మవారి గొంతులో సరైన తీర్థాన్ని పోసారు. అది తీర్థమే అయినా చాలామంది కమ్మవారికి ప్రస్తుతానికి…

సర్వం నాకిపోతే తప్ప ఒక్కోసారి తత్వం బోధపడదు. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. ఆంధ్రజ్యోతి ఆర్కే ఇన్నాళ్లకి కమ్మవారి గొంతులో సరైన తీర్థాన్ని పోసారు. అది తీర్థమే అయినా చాలామంది కమ్మవారికి ప్రస్తుతానికి చేదు విషంలా అనిపించవచ్చు. ఎందుకంటే కమ్మవారికి చెవిలో మాత్రం చెప్పాల్సిన విషయాన్ని బహిరంగంగా టీవీ ఛానల్లో యావన్మంది కులాల వారు చూస్తుండగా మొట్టికాయ మొట్టినట్టు చెప్పాడు కాబట్టి. 

కమ్మవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని, కోస్తాలో కమ్మవారిపై ఇతర కులాల్లో ఉన్న వ్యతిరేకత రాయలసీమలో రెడ్ల పై ఎందుకులేదో ఆలోచించాలని ఆయన ఘోషించారు. ఎదురుగా కూర్చున్న కమ్మ పెద్దలు అవునని గంగిరెద్దుల్లా తలలూపారు. అసలే వచ్చేది సంక్రాంతి కూడా!

తెలుగు రాష్ట్రాల్లో ఏ కులానికి ఏ ఇతర కులం మీద ఏకగ్రీవ ద్వేషం లేదు. కానీ కమ్మవారికి మాత్రం ఏదో శాపం తగిలినట్టుగా ఉంది ప్రస్తుతం. అయితే వీళ్లు చేసిన పాపమేంటి?

“తెలుగుదేశం పేరుతో రాజకీయంగా జెండా ఎగరవేస్తూనే కళాశాలలు, కార్పోరేట్ పాఠశాలలు, హాస్పిటళ్లు, హోటళ్లు అన్నీ పెట్టి అభివృద్ధి చేసిన దాంట్లో కమ్మవారున్నారు….అది తప్పా?” అని అడుగుతారు మనలో చాలామంది. 

అది తప్పు కాదు. అయితే ఆయా ఎదుగుదలలో ఇతర కులస్థులుని తొక్కుకుంటూ కేవలం “కమ్మే జనా సుఖినో భవంతు” నినాదంతో ముందుకు పోవడమే కమ్మ వారి పతనానికి నాంది పలికింది. 

ఆర్కే చెప్పేది కూడా అదే. ఇతర కులస్థుల్ని కలుపుకోకుండా అమరావతి ఉద్యమమేంటఏది ఆయన ప్రశ్న. 

అసలీ జాడ్యం ఇప్పటిది కాదు. కమ్మ విద్యార్థులు పేరెన్నికగన్న కళాశాలల్లో కులకూటుములు నడిపారు. విజయవాడ, గుంటూరు కాలేజీల్లో మొదలైన ఆ కూటములు రాష్ట్రమంతా పాకాయి. ఆ కూటముల్ని ఏకంగా రాష్ట్రం కూడా దాటించి మణిపాల్, గుల్బర్గా, చెన్నై వరకు తీసుకెళ్లారు. అంటే కమ్మ కులానికి చెందిన విద్యార్థినీవిద్యార్థులంతా ఒక గ్రూప్. వాళ్లు గుంపులుగానే తిరుగుతారు. కమ్మ జూనియర్స్ ని కమ్మ సీనియర్స్ ర్యాగింగ్ చెయ్యరు. ఇతర కులస్థుల్ని మాత్రమే చేస్తారు. ఇతర కులాల వారిని కలుపుకోరు. ఎప్పుడైతే ఐకమత్యం స్థాయి దాటి ఇలా క్యాస్ట్ ఫీలింగ్ దారి పట్టిందో కమ్మకులం ఇతర కులస్థుల మనసుల్నుంచి దూరమవడం జరిగింది. 

అలా కాలేజీల్లో బయలుదేరిన కమ్మసంఘాలు కమ్మ హీరోల్ని భుజాలకెత్తుకుని ఊరేగడం మరొక విషయం. ఆమాటకొస్తే అధిక శాతం కమ్మ హీరోలే ఉన్నప్పుడు ఆధిపత్య ధోరణని ప్రదర్శించుకోవడం అనవసరం కదా. కులానికొక్కడే ఉంటే పోనీ ఉనికి చాటుకోవడానికి మోస్తున్నారులే అనుకోవచ్చు.

అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. కానీ అన్నీ ఉన్నా కమ్మవారు ఎగిరెగిరి పడ్డారు. అందుకే ఆకులో ఉన్నదంతా నేలపాలవుతోంది. అదీ పరిస్థితి. 

ఇదిలా ఉంటే కమ్మవారు వేలు పెట్టని రంగం లేదు. ఆఖరికి పంచాంగం చూసే చౌదరిగారు, ముహూర్తాలు పెట్టే నాయుడుగారు, పెళ్ళి మంత్రాలు చదివే కమ్మపురోహితులు కూడా బయలుదేరారు. విద్యారంగం, వైద్యరంగం, వ్యాపార రంగం అంటే వ్యాపారాలనుకోవచ్చు. ఇప్పటికీ ఒకానొక కులానికి మాత్రమే పరిమితమై ఉన్న పనులని కూడా వీళ్లు ఆక్రమించుకుని ఆధిపత్యం ప్రదర్శించాలనుకోవడం ఆ కులం వారికే కాదు ఇతర కులాల వారికి కూడా నచ్చలేదు. 

ప్రతి కులానికి ఒక సంఘం, ప్రతి కులం వారు ప్రత్యేక వనభోజనాలు పెట్టుకునే పరిస్థితి ఉన్నా…కమ్మవారి మీటింగులే హాట్ టాపిక్ అవడం మొదలపెట్టాయి చాలా నాళ్ల క్రితమే. దానికి కారణం ఉంది. 

సామాజికంగానో, రాజకీయంగానో వెనుకబడిన కులాల వారు తమ సంఘాల్లో మాట్లాడుకున్నది బయటకు వచ్చినా దానిని సీరియస్ గా తీసుకుంటుంది మిగతా సమాజం. 

కానీ అన్నిట్లోనూ ఆధిపత్యం ఉన్న కమ్మ సంఘాల వాళ్లు “ఇది మన బ్లడ్డు..కమ్మ వాడు తన రక్తాన్ని ఇతర కులస్థులకి ఇవ్వకూడదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప కమ్మవాడిగా పుట్టరు. అందానికి, తెలివికి, ఆకర్షణకి చిరునామా కమ్మ కులమే…” ఇలాంటి తొడ చరుపులు ఎక్కువైపోయి సోషల్ మీడియా పుణ్యమా అని అవన్నీ బయటపడి నవ్వులపాలవడం జరిగింది. 

ఆ మధ్య కమ్మకులం వైభవం మీద ఒక పాట కూడా యూట్యూబులో రిలీజయ్యింది. మీడియా చానల్స్ కూడా ఆ పాటని ఏకి పారేసాయి. అంటే ఎంతటి అసహ్యమైన స్థితికి లాక్కేళ్లారో కులపిచ్చ వెర్రితలలు వేసిన కొందరు కమ్మ ప్రబుద్ధులు అనిపిస్తుంది. 

ఇవన్నీ ఒకెత్తైతే, “మా బ్లడ్ వేరు..మా బ్రీడ్ వేరు” లాంటి బాలకృష్ణ పంచులు కమ్మప్రతిష్టకి మరింత మంట పెట్టాయి. అసలు బాలకృష్ణ ని అన్ని వయసుల కమ్మకులస్థులు మోస్తున్నట్టు ఏ ఇతర కులం హీరోని ఆ కులాలవాళ్లు అంతలా మోయరు. చిరంజీవికైనా, పవన్ కైనా కాపు యువకుల ఫాలోయింగ్ ఉండొచ్చు కానీ వయసు పైబడిన కాపు పెద్దలు “మావోడు ..మావోడు” అంటూ ఊరేగరు. అది ఒక్క బాలకృష్ణకే కుదురుతోంది. మొన్నొచ్చిన “అఖండ” ని కూడా కమ్మజనులు ప్రతిష్టగా తీసుకుని, బల్క్ టికెట్ బుకింగ్స్ చేసి, హౌస్ఫుల్ అన్న కలరిచ్చి హడావిడి చేసారు. ఆ పబ్లిసిటీ దెబ్బకి సినిమాకి హిట్ టాక్ వచ్చి చాలామంది చూసారు. అలా మొత్తానికి సినిమాని ఆడించుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఇతర కులాల వారు చూస్తూనే ఉంటారుగా! 

మరో ముఖ్యమైన విషయం గమనిద్దాం. 

పరిటాల రవీంద్ర- మద్దెలచెర్వు సూరి శత్రువులు. ఇద్దరూ ఫ్యాక్షనిష్టులు. పరిటాలని కమ్మవారు రామారావు తర్వాత అంతటి కులస్థాయినిచ్చి విగ్రహాలు పెట్టారు. సరే, లోకల్ లీడర్ కాబట్టి అనంతపురంలో ఆయన విగ్రహాలు ఉంటే ఉన్నాయి. అసలాయనికీ కృష్ణ-గుంటూరు కి సంబంధమేంటి? అక్కడ కూడా పరిటాల విగ్రహాలు దర్శనమిస్తాయి. 

పరిటాల వెనుక కమ్మలున్నట్టు, సూరి వెనుక రెడ్లు లేరు. 

అలాగే వంగవీటి మోహన రంగా- దేవినేని నెహ్రూ ప్రత్యర్థులు. రంగాని ఫ్యాక్షనిష్టుగా ముద్రవేసి పక్కనపెట్టి నెహ్రూని మాత్రం మంచివాడుగా చూపించే ప్రయత్నం చేస్తారు కమ్మవారు. నిజానికి ఇద్దరూ హింసాయుత రాజకీయాలు నడిపారు. కానీ కాపులకి మీడియాలేదు, కమ్మలకి ఉంది. ఆ మీడియా సాయంతో నెహ్రూని శాంతికపోతంగా చూపించే ప్రయత్నం చేసారు. 

పల్నాడు ఏరియాలో ఎవరికైనా తెలిసే విషయం ఒకటుంది. 2014 నుంచి 2019 వరకు కమ్మవారిదే రాజ్యం. అదెలాగంటే తప్పు చేసినవాడు కమ్మైతే పోలీస్ స్టేషన్లో కేసుండదు. ఇతరులైతేనే ఎఫ్ఫయ్యార్ నమోదవుతుంది. అలాగే ఏ సామాన్యుడికైనా ఏ బర్త్ సర్టిఫికెట్టొ అవసరమైతే లోకల్ కమ్మ-పెద్దాయన సిఫార్సు కావాలి. లేకపోతే పని జరగదు. 

ఇవన్నీ చెబితే అభూతకల్పనలు అనిపించొచ్చు. అందుకే పల్నాడు ప్రాంతం అని ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇలాంటి ఘోరమైన వాస్తవాలు ఆ కులాన్ని ఇతర సమాజానికి మానసికంగా దూరం చేసాయి. 

ఎంత సేపూ, “మేం గొప్ప..మా జాతి గొప్ప…మా రామారావు గొప్ప…” ఇదే సోది నలభై ఏళ్ల పాటు ఊదరగొట్టి జనాల్ని విసిగించేసారన్న వాస్తవం కమ్మవారు గ్రహించాలి. 

ఇక సోషల్ మీడియాలో తెదేపాని వెనకేసుకొచ్చే వాళ్లల్లో అధికశాతం మంది కమ్మవారే. అది పార్టీని మరింత నిర్వీర్యం చేస్తోంది. చింత చచ్చినా పులుపు చావదంటే ఇదే. తెదేపా నడుం విరిగి చతికిలపడ్డా “మా చంద్రబాబు…మా అమరావతి..” అనే నినాదాలు పార్టీని మరింత ముంచేస్తున్నాయి. 

సెల్ఫ్ డబ్బా మరీ గట్టిగా కొట్టేసుకుని ఉన్న కొంపని కూల్చేసుకున్నవాళ్లు ఎవరంటే కమ్మవారే అని చెప్పాలి. 

ఎప్పుడు తగ్గాలో, ఎప్పుడు నెగ్గాలో తెలుసుకోవాలనంటారు. ప్రస్తుతం కమ్మవారు సెల్ఫ్ డబ్బా మానేసి ఎంత సైలెంటుగా ఉంటే అంత మంచిది. లేకపోతే పూర్వవైభవం కాదు కదా ఉన్న టెంటు కూడా ఎగిరిపోవడం ఖాయం. 

ఆర్కే ప్రస్తావించిన కమ్మవారి ఆత్మపరిశీలన విషయంలో ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. 

– శ్రీనివాసమూర్తి