సినిమా టికెట్లపై శుభం కార్డు ఎలా?

సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించేందుకు ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ ఏం తేలుస్తుందోన‌నే ఉత్కంఠ నెల‌కుంది. సినిమా టికెట్ల ధ‌ర‌ల వ్య‌వ‌హారం హైకోర్టు మెట్లు ఎక్కిన సంగ‌తి తెలిసిందే. సినిమా టికెట్‌ రేట్లను ఖరారు చేస్తూ…

సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించేందుకు ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ ఏం తేలుస్తుందోన‌నే ఉత్కంఠ నెల‌కుంది. సినిమా టికెట్ల ధ‌ర‌ల వ్య‌వ‌హారం హైకోర్టు మెట్లు ఎక్కిన సంగ‌తి తెలిసిందే. సినిమా టికెట్‌ రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 35తో సంబంధం లేకుండా, అంతకు ముందున్న విధంగానే ధరలు ఖరారు చేసుకోవచ్చంటూ మొద‌ట సింగిల్‌ జడ్జి ఉత్త‌ర్వులు ఇచ్చారు.

ఈ ఉత్త‌ర్వుల‌పై రాష్ట్ర ప్రభుత్వం డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించింది. సింగిల్ బెంచ్ ఉత్త‌ర్వుల‌ను నిలుపుద‌ల చేస్తూ, థియేట‌ర్ల య‌జ‌మానులు త‌మ ప్ర‌తిపాద‌న‌ల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ ముందు ఉంచాల‌ని డివిజ‌న్ బెంచ్ ఆదేశించింది. అంతేకాదు, సినిమా టికెట్ల పెంపున‌కు సంబంధించి ఓ క‌మిటీ వేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో హైకోర్టు ఆదేశాల మేర‌కు క‌మిటీ వేసిన‌ట్టు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ (ఏజీ) ఎస్‌.శ్రీ‌రామ్ న్యాయ‌స్థానానికి నివేదించారు. ఇప్ప‌టికే క‌మిటీ ఒక‌సారి స‌మావేశ‌మైంద‌ని ఏజీ పేర్కొన్నారు.

త్వ‌ర‌లో మ‌రోసారి స‌మావేశ‌మ‌వుతుంద‌ని, ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో ఓ కొలిక్కి వ‌స్తుంద‌ని కోర్టు దృష్టికి ఏజీ తీసుకెళ్లారు. అప్ప‌టి వ‌ర‌కూ విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని ఏజీ విన్న‌వించారు. ఏజీ అభ్య‌ర్థ‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ప్ర‌ధాన న్యాయ మూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్‌కుమార్ మిశ్రా, న్యాయ‌మూర్తి జ‌స్టిస్ మ‌ల్ల‌వోలు స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి త‌దుప‌రి విచార‌ణ‌ను ఫిబ్ర‌వ‌రి 10కి వాయిదా వేశారు. దీంతో ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ టికెట్ల రేట్ల‌ను ఏ విధంగా నిర్ణ‌యిస్తుందోన‌ని టాలీవుడ్ ఆందోళ‌న‌కు గురి అవుతోంది. 

ప్ర‌భుత్వం సూచించిన టికెట్ల ధ‌ర‌ల‌తో చిత్ర ప‌రిశ్ర‌మ మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌వుతుంద‌ని నిర్మాత‌లు, ప‌లువురు హీరోలు, థియేట‌ర్ల య‌జ‌మానులు వాపోతున్నారు. భారీ రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని ప్ర‌భుత్వం కౌంట‌ర్ ఇస్తోంది. టికెట్ల ధర‌ల స‌మ‌స్య‌కు శుభం కార్డు ఏ విధంగా ప‌డుతుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.