వర్మ Vs నాని.. టికెట్ రేట్లపై ఆసక్తికర చర్చ

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న టికెట్ రేట్ల వ్యవహారంపై టీవీ9 ఛానెల్ లో ఆసక్తికర చర్చ సాగింది. మాటకారిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ అడిగిన ప్రశ్నలకు, మంత్రి పేర్ని నాని అంతే సూటిగా…

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న టికెట్ రేట్ల వ్యవహారంపై టీవీ9 ఛానెల్ లో ఆసక్తికర చర్చ సాగింది. మాటకారిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ అడిగిన ప్రశ్నలకు, మంత్రి పేర్ని నాని అంతే సూటిగా సమాధానాలివ్వడం ఆకర్షించింది. మంత్రిని ఇరుకునపెట్టాలని ప్రయత్నించిన ప్రతిసారి వర్మ ఫెయిల్ అవ్వడం కొసమెరుపు.

ఆర్జీవీ: తయారీదారు తన తయారుచేసిన వస్తువుకు 500 రూపాయలు ఫిక్స్ చేసుకున్నాడు. దాన్ని ఆ రేటుకు కొనాలా వద్దా అనేది వినియోగదారుడి ఇష్టం. మధ్యలో ప్రభుత్వం వచ్చి పేదల కోసం 500 రూపాయలకు కాకుండా, 50 రూపాయలకే అమ్మాలని చెప్పడం ఎంత వరకు కరెక్ట్.

మంత్రి పేర్ని నాని: వస్తువులు, ఉత్పత్తులు కొనుక్కున్నప్పుడు గ్యారెంటీ/వారంటీ ఉంటుంది. రిపేర్ వస్తే చేసి ఇస్తారు. లేదంటే డబ్బు వాపస్ ఇస్తారు. ఇంకా పంచాయితీ తెగకపోతే వినియోగదారుల హక్కుల ఫోరమ్ కూడా ఉంది. అక్కడ కూడా ప్రభుత్వం ఉంది. వస్తువు అమ్మకం-కొనుగోలుకు సంబంధించి అవకతవకలు జరిగితే కన్జూమర్ ఫోరమ్, దానికో రిటైర్డ్ జడ్జి ఉంటారు.

ఆర్జీవీ: కూరగాయల విషయంలో ఇలాంటివి ఉండవు కదా. ఎంత రేటు పెడితే అంత కొనాల్సిందే. టమాటాలు పాడైపోయాయని, వెనక్కి ఇవ్వడం ఉండదు కదా.

మంత్రి నాని: కూరగాయలు కూడా పుచ్చిపోయినవి కొనరు కదా. పైగా అక్కడ కూడా ధరల నియంత్రణకు ప్రభుత్వం ఉంది. అక్కడ కూడా కమిటీలు, వ్యవస్థలు ఉన్నాయి.

ఆర్జీవీ: తయారీదారుడు ఓ ఎమ్ఆర్పీ ఫిక్స్ చేసుకుంటాడు. నచ్చితే వినియోగదారుడు కొనుక్కుంటాడు. అక్కడ కలెక్టర్ లేదా ప్రభుత్వం రేటు ఫిక్స్ చేయదు కదా. అలాంటప్పుడు సినిమాకు ఎందుకు?

మంత్రి నాని: మీ సినిమాను శాటిలైట్ ఛానెల్ కో, ఓటీటీకో అమ్ముకున్నప్పుడు అందులో ప్రభుత్వం ప్రమేయం ఉండదు కదా. కానీ అదే సినిమాను థియేటర్ లో ప్రసారం చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది. కొన్ని రూల్స్ ఉంటాయి. చట్టం ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది.

ఆర్జీవీ: ప్రతి సినిమాకు ఓ కాస్ట్ ఉంటుంది. బాహుబలి, పుష్ప సినిమాల టికెట్ రేట్లకు, ఓ సాధారణ సినిమా టికెట్ రేటుకు డిఫరెన్స్ లేకపోతే ఎలా?

మంత్రి నాని: ఏపీలో మల్టీప్లెక్సుల్లో ఎక్కువ రేటే ఉంది. టాలీవుడ్ జనాలు అభ్యంతరం చెబుతోంది పంచాయతీ, నగర పంచాయతీ ఏరియాల్లో టికెట్ రేట్ల గురించి మాత్రమే. ప్రజల అభిప్రాయం మేరకు ఆ టికెట్ రేట్లు ఉన్నాయి.

ఆర్జీవీ: కోట్లు పెట్టి ఓ సినిమా తీసినప్పుడు, దాని టికెట్ రేటు ఫిక్స్ చేసుకునే హక్కు కూడా నిర్మాతకే ఉండాలి. స్లాబ్ రేట్ల ఆధారంగా టికెట్ ధర నియంత్రించుకునే హక్కు నిర్మాతకు ఎందుకు ఇవ్వడం లేదు.?

మంత్రి నాని: థియేటర్ లో సినిమా ప్రసారం చేసినప్పుడు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్టు వ్యవహరించాలి. ఒకే సినిమాకు థియేటర్లలో నేల టికెట్, బాల్కనీ అనే సెగ్మెంట్లు ఎందుకు పెట్టారు? సినిమా బడ్జెట్  ఒకటే కదా? మరి ఈ సెగ్మెంట్లు ఎందుకు? ఎందుకంటే.. వినోదాన్ని పేదవాడికి కూడా అందించాలనేది ఉద్దేశం. కోట్లు పెట్టి సినిమా తీశాం కాబట్టి రేట్లు పెంచుకుంటామంటే కరెక్ట్ కాదు.

ఆర్జీవీ: సినిమాటోగ్రఫీ చట్టంలో టికెట్ రేట్ల ప్రస్తావన లేనప్పుడు.. ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంది?

మంత్రి నాని: చట్టంలో అలా లేనప్పుడు.. మొదటిసారే కోర్టులో కేసు వేసినప్పుడే వీగిపోవాలి కదా? అలా ఎందుకు జరగలేదు. చట్టంలో టికెట్ల అంశం లేనప్పుడు జాయింట్ కలెక్టర్ ను వెళ్లి కలవాలని జడ్జి ఎందుకు తీర్పునిస్తారు? కమిటీ వేయమని ఎందుకు చెబుతారు? కేసును నేరుగా కొట్టేయొచ్చు కదా? టికెట్ రేట్ల వ్యవహారంపై ప్రభుత్వంతో సంబంధం లేదన్నప్పుడు కోర్టులు నేరుగా తీర్పు ఇవ్వొచ్చు కదా?

ఆర్జీవీ: టికెట్ రేట్ల వ్యవహారంపై ఫైనల్ గా మీరు ఏం చెబుతారు?

మంత్రి నాని: అభిమానాన్ని దోచుకోకూడదు. అంతా మా ఇష్టం అంటే కుదరదు. రేటును ఎలా కావాలంటే అలా పెంచుకుంటానంటే కరెక్ట్ కాదు. అభిమానంతో మొదటి రోజు చూడాలనే ప్రేక్షకుడికి, భారీ రేటు పెట్టి చూడాలని చెప్పడం అన్యాయం అంటాను. అది అభిమానాన్ని దోచుకోవడమే కదా. ఈ పద్ధతి మారాలంటాను నేను.