ప్రభాస్ ఇంటర్వ్యూలు రద్దు

ఆర్ఆర్ఆర్ పై, రాజమౌళిపై ఇప్పటికే ట్రోలింగ్ మొదలైంది. ఆర్ఆర్ఆర్ అర్థాన్ని “రాను, రాలేను, రాలేకపోతున్నాను” అని మార్చేశారు నెటిజన్లు. రాధేశ్యామ్ కూడా ఈ కౌంటర్లకి భయపడే ఏ ప్రకటనా చేయట్లేదు. పైపెచ్చు కన్ఫ్యూజన్ నడుస్తున్న…

ఆర్ఆర్ఆర్ పై, రాజమౌళిపై ఇప్పటికే ట్రోలింగ్ మొదలైంది. ఆర్ఆర్ఆర్ అర్థాన్ని “రాను, రాలేను, రాలేకపోతున్నాను” అని మార్చేశారు నెటిజన్లు. రాధేశ్యామ్ కూడా ఈ కౌంటర్లకి భయపడే ఏ ప్రకటనా చేయట్లేదు. పైపెచ్చు కన్ఫ్యూజన్ నడుస్తున్న టైమ్ లోనే  నిర్మాతలు ఆర్భాటంగా 14న రిలీజ్ పక్కా అంటూ పోస్టర్లు కూడా విడుదల చేశారు. కానీ ప్రభాస్ మాత్రం తన ఇంటర్వ్యూలను క్యాన్సిల్ చేసుకోవడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. రాధేశ్యామ్ కూడా రాదని అంతా ఫిక్స్ అయిపోయారు.

ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో థియేటర్లు మూతబడటంతో ఆర్ఆర్ఆర్ పోటీనుంచి తప్పుకుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి రాధేశ్యామ్ కి కేవలం తెలుగు రాష్ట్రాలతోనే పని అయిపోతుందని అనుకోలేం. ప్రస్తుతానికి గంభీరంగా ఉన్నా.. నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడటం ఖాయం అని తేలిపోయింది.

మొత్తమ్మీద రాధేశ్యామ్ వెనక్కు తగ్గినట్టే కనిపిస్తోంది. సినిమా వాయిదా ప్రకటన ఇప్పటికిప్పుడు బహిరంగంగా చెప్పినా చెప్పకపోయినా.. ప్రమోషన్ మాత్రం ఆపేశారు. వాస్తవానికి జనవరి 1 నుంచి ప్రభాస్ హిందీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వాలి. చిత్ర యూనిట్ తో కలసి ముంబైలో ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవ్వాలి. కానీ అవేవీ జరగలేదు. ముందు కుదుర్చుకున్న అపాయింట్ మెంట్లు కూడా క్యాన్సిల్ అయ్యాయి. దీంతో రాధేశ్యామ్ విడుదలపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టయింది.

ఆది నిష్టూరమే మేలు..

ధైర్యం చేసి సినిమా విడుదల చేసి, తీరా.. రెండో రోజో మూడో రోజో థియేటర్లు మూతబడితే అప్పుడు ఎవరూ ఏం చేయలేని పరిస్థితి. ఓటీటీలు కూడా బేరాలాడుతాయి కానీ, అడిగిన మొత్తం ఇవ్వవు. అందుకే అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలని ముందస్తుగా వాయిదా కోరుకుంటున్నాయి పెద్ద సినిమాలు.

ప్రభాస్ ప్రమోషన్ కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు క్యాన్సిల్ చేసుకోవడంతో రాధేశ్యామ్ పై అభిమానులు కూడా ఆశలు వదిలేసుకున్నారు. టైమ్ బాగోలేనప్పుడు ఎవ్వరైనా తగ్గాల్సిందే. నిన్నమొన్నటి వరకూ రిలీజ్ డేట్స్ కోసం కొట్టుకున్న సినిమాలు.. ఒమిక్రాన్ దెబ్బకి అస్త్ర సన్యాసం చేయాల్సి వస్తోంది.