కరణం బలరాం.. వైసీపీకి బలమా..? భారమా?

ఈ ఫ్లెక్సీ ఓసారి చూడండి. ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేష్ మినహా మిగతా వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు. కులసంఘాల మీటింగ్ పాంప్లేట్ కంటే దారుణంగా ఉందీ…

ఈ ఫ్లెక్సీ ఓసారి చూడండి. ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేష్ మినహా మిగతా వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు. కులసంఘాల మీటింగ్ పాంప్లేట్ కంటే దారుణంగా ఉందీ ఫ్లెక్సీ.

ఇప్పటికే వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ నడుస్తుందనే అపవాదు ఉంది. అది కేవలం అపోహ మాత్రమేనని, జగన్ కేబినెట్ లో 70 శాతం మంది ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలే ఉన్నారని పదే పదే చెప్పుకుంటున్నా.. ఇలాంటి ఫ్లెక్సీ ఒక్కటి చాలు వైసీపీపై కులం ముద్ర వేయడానికి.

టీడీపీలో కుల రాజకీయాలను బాగా వంటబట్టించుకున్న కరణం బలరాం వైసీపీలో (అనధికారికంగా) చేరినా కూడా ఆ మురికి వదిలించుకోనట్టుంది. అందుకే.. కేవలం జగన్ సామాజిక వర్గానికి చెందిన నాయకులనే ఏరికోరి మరీ ఓ ఫ్లెక్సీలో వేసి.. తన పైత్యం చూపించారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం, ఏంటి ఉపయోగం? జగన్ పై లేనిపోని అపనిందలు వేయడం మినహా.. ఇలాంటి ప్రచారంతో లాభం ఏంటి?

దళిత వర్గానికి చెందిన స్థానిక ఎంపీ నందిగం సురేష్ ఫొటో కూడా ఫ్లెక్లీలో లేదంటే.. దీన్ని కుల పోస్టర్ అనకుండా ఉండగలరా..?

పోనీ ఆ పోస్టర్ లో ఉన్న స్థానిక నేతలంతా జగన్ కి అండగా ఉన్నారా అంటే అదీ లేదు. గత ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేశారు, ఇంకా టీడీపీతోనే లోపాయికారీగా కొనసాగుతున్నారు. కేవలం ఒకే సామాజిక వర్గం అనే కారణంతో అందర్నీ ఓ చోట చేర్చి, చీరాల వైసీపీపై సింపుల్ గా కులముద్ర వేసేశారు కరణం బలరాం. తద్వారా ముఖ్యమంత్రి జగన్ కు అదనపు తలనొప్పులు తెప్పిస్తున్నారు.

చంద్రబాబుకి నమ్మినబంటు అనే పేరున్న కరణం బలరాం.. పార్టీ అధికారం కోల్పోగానే.. అదను చూసి వైసీపీలో దూకాలని చూశారు. పదవులకు రాజీనామా చేయకుండా ఎవర్నీ పార్టీలో చేర్చుకోబోమని జగన్ ఖరాఖండిగా చెప్పడంతో.. కొడుకు వెంకటేష్ కి వైసీపీ కండువా కప్పించి, తాను మాత్రం ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తూ పూర్తిగా వైసీపీ గూటికి చేరకుండా.. టీడీపీని పల్లెత్తు మాట అనకుండా పునరావాసం గడుపుతున్నారు. చివరికి బలరాంతో పాటు భారీగా వలసలు ఉంటాయనుకుంటే, అది కూడా జరగలేదు. నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ అలానే ఉంది.

టీడీపీకి బలమైన ఓటుబ్యాంకుగా పనిచేసిన చేనేత సామాజిక వర్గం నాయకులు కూడా బలరాంతో పాటు ఆ పార్టీని వీడి బైటకు రాలేదు. లీడర్లను తీసుకు రాలేదు, క్యాడర్ ని తీసుకు రాలేకపోయారు.. ఇక కరణం బలరాం వైసీపీ గూటికి చేరడం వల్ల వైసీపీకి లాభం ఏంటి? లాభం లేకపోగా.. స్థానిక నేతలతో వైరం కారణంగా పార్టీకి నష్టం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీనికితోడు చీరాల వైసీపీ ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో బలరాంకు ఉన్న విబేధాలు గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే వీరి పంచాయితీ వైసీపీ పెద్దల వరకూ వెళ్లింది. కొడుకుని ప్రమోట్ చేసుకోవాలనుకునే క్రమంలో.. స్థానికంగా వైసీపీని బలహీన పరుస్తున్నారనే అపవాదు కూడా బలరాంపై ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్థంతి కార్యక్రమాల్లో కూడా స్థానిక వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడి.. సమావేశాల్ని రసాభాస చేసిన ఉదాహరణలూ ఉన్నాయి.

ఇక మూడు రాజధానులకు ఏనాడూ బలరాం కానీ, ఆయన కొడుకు కానీ బహిరంగ మద్దతు తెలపలేదు. మూడు రాజధానుల విషయంలో పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమంలోనూ బలరాం వర్గం పాల్గొనలేదు. ఇప్పుడిలా కుల పైత్యాన్ని బ్యానర్లలో వేసి పార్టీ పరువు పూర్తిగా గంగలో కలిపేస్తున్నారు తండ్రీ కొడుకులు.

ఇకనైనా ఇలాంటి వలస నాయకులతో జాగ్రత్తగా ఉండకపోతే.. వైసీపీపై పూర్తిగా కులముద్ర పడటం మాత్రం ఖాయం. 

జనసైనికులకు మాత్రం పండగే