వచ్చే ఎన్నికల్లో కలుద్దాం.. ఇట్లు, మీ పవన్ కల్యాణ్

పాతికేళ్ల ప్రస్థానానికి సిసలైన అర్థం చెబుతున్నారు పవన్ కల్యాణ్. ఓవైపు రాజకీయ నాయకుడినని చెప్పుకుంటూనే మరోవైపు ఫుల్ లెంగ్త్ నటుడిగా కొనసాగుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా సినిమాలు ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. మొన్నటి…

పాతికేళ్ల ప్రస్థానానికి సిసలైన అర్థం చెబుతున్నారు పవన్ కల్యాణ్. ఓవైపు రాజకీయ నాయకుడినని చెప్పుకుంటూనే మరోవైపు ఫుల్ లెంగ్త్ నటుడిగా కొనసాగుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా సినిమాలు ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో హడావుడి చేసిన పవన్ కల్యాణ్.. మళ్లీ 2024 ఎన్నికల్లోనే కనిపించబోతున్నారు. ఇది మాత్రం ఫిక్స్.

వకీల్ సాబ్ తో రీఎంట్రీ ఇస్తున్న పవన్.. ఆ వెంటనే క్రిష్ సినిమా ప్రకటించారు. కొన్ని రోజులాగి హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా ఎనౌన్స్ చేశారు. ఈ 3 సినిమాలతో ఆగుతారని అంతా అనుకున్నారు. వీలైనంత త్వరగా వీటిని పూర్తిచేసి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తారని అనుకున్నారు. కానీ పవన్ మాత్రం ఆగేలా కనిపించడం లేదు.

తాజాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు. మధ్యలో రామ్ తళ్లూరి-సురేందర్ రెడ్డి సినిమా కూడా ఉన్నట్టుంది. ఇలా ఒకేసారి 5 సినిమాలు లైన్లో పెట్టారు జనసేనాని. పవన్ వర్కింగ్ స్టయిల్ అందరికీ తెలుసు కాబట్టి, ఇవన్నీ పూర్తయ్యేసరికి మళ్లీ ఎన్నికలు రావడం గ్యారెంటీ.

అప్పుడు మళ్లీ తను రాజకీయ నాయకుడినని, పాతికేళ్ల ప్రస్థానంతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతారు పవన్. గత ఎన్నికల్లో జగన్ పై విమర్శలు చేసినట్టే.. ఆవేశంతో ఊగిపోతూ 2024 ఎన్నికల్లో కూడా జగన్ పై విరుచుకుపడతారు. అంతకుమించి రాజకీయాల్లో పవన్ చేసేదేం ఉండకపోవచ్చు.

అయితే ఈ గ్యాప్ లో తను మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లోనే ఉన్నానని చెప్పుకోవడం కోసం పవన్ తన సినిమా బ్రెయిన్ కు బాగానే పదునుపెట్టారు. ఓ మంచి టీమ్ ను సెట్ చేసి ప్రెస్ నోట్లు రాయించే పని పెట్టారు. మీడియా సలహాదారు టాపిక్ చెబుతాడు, వీళ్లు నోట్స్ ప్రిపేర్ చేస్తారు.

పవన్ తో సంబంధం లేకుండా పవన్ పేరిట ఆ ప్రెస్ నోట్లు అలా రిలీజ్ అయిపోతుంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తే పవన్ ఓ బుల్లి వీడియో రిలీజ్ చేస్తారు. అంతేతప్ప, ప్రెస్ మీట్స్ పెట్టడం లాంటివి ఈ నాలుగేళ్లలో జరక్కపోవచ్చు.

అదే సినిమాల విషయానికొస్తే మాత్రం ప్రెస్ మీట్ ఏం ఖర్మ.. ఏకంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు జరుగుతాయి. ఆ వేదికలపై పవన్ పైపైన మాట్లాడ్డం కాదు, అనర్ఘలంగా మాట్లాడేస్తారు కూడా. రాబోయే రోజుల్లో ఇవన్నీ మనం చూడబోతున్నాం.

పవన్ కు ఆదాయ మార్గం సినిమాలు మాత్రమే అని అతడి ఫ్యాన్స్ అంటుంటారు. అంతెందుకు.. ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా గతంలో ఎన్టీఆర్ నటించలేదా అనే లాజిక్కులు తీసేవాళ్లు కూడా ఉన్నారు. అలా అని ఐదేళ్ల పాటు సినిమాలు తీసుకొని సరిగ్గా ఎన్నికలకు ముందు జనం మధ్యలోకొచ్చి నోటికొచ్చినట్టు విమర్శలు చేయడం కరెక్టా?

జనసైనికులకు మాత్రం పండగే