సంక్షేమమే ధ్యేయంగా దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇచ్చిన మాట ప్రకారం… వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ రైతుభరోసా సొమ్మును రైతులకు అందించబోతున్నారు. మరికాసేపట్లో ఏపీలోని రైతులందరి ఖాతాల్లోకి రెండో దఫా రైతు భరోసా డబ్బులు జమ కాబోతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన రైతు భరోసా హామీని ఫక్తు పొలిటికల్ స్టంట్ గా కొట్టిపారేసింది తెలుగుదేశం పార్టీ. రెవెన్యూ లోటుతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రంలో రైతుభరోసా అమలు కేవలం భ్రమ అని వాదించింది. కానీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే రైతు భరోనా పథకాన్ని అమలుచేశారు జగన్. రైతులకు మంచి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే చాలని నిరూపించారు.
ఏటా 13,500 చొప్పున ఐదేళ్లలో ప్రతి రైతుకు 67,500 రూపాయలు వ్యవసాయ సాయం కింద అందించడం ఈ పథకం లక్ష్యం. నిజానికి ఎన్నికల ప్రచారంలో తన చెప్పిన మొత్తం కంటే ఎక్కువే ఇప్పుడిస్తున్నారు జగన్. అంతేకాదు.. నాలుగేళ్లు అనుకున్న సాయాన్ని ఐదేళ్లకు కూడా పెంచారు.
ఇక ఈ దఫా 1114 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమకాబోతున్నాయి. ఆల్రెడీ ఉన్న అప్పుల కింద ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత బాకీ కింద తీసుకోవడానికి వీల్లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఏ బ్యాంక్ రైతుభరోసా డబ్బుల్ని ఆపడానికి వీల్లేదు.
ఒకవేళ ఎకౌంట్ లో డబ్బులు పడకపోయినా, బ్యాంకుతో ఇబ్బంది ఎదురైనా వెంటనే హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. రైతుభరోసాతో పాటు వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ అందించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు రాష్ట్రంలో రైతులు తమ పంటల్ని నష్టపోయారు. అలా దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ అందించాలని నిన్ననే వేర్వేరు జీవోలు విడుదల చేశారు. రైతుల బ్యాంక్ ఖాతాలు, ఆధార్ నంబర్, వ్యవసాయ పంట నష్టం తదితర వివరాల్ని పరిశీంచి ఖాతాల్లో ఈ మొత్తాల్ని కూడా వేయబోతున్నారు.