అభివృద్ధి వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హై-పవర్ కమిటీ రెండోసారి భేటీ కానుంది. ఈరోజు సమావేశం కానున్న 16 మంది సభ్యులతో కూడిన హై-పవర్ కమిటీ అమరావతి అభివృద్ధిపై చర్చించనుంది. ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల్ని దృష్టిలో పెట్టుకొని దీనిపై ముందుగా చర్చించాలని నిర్ణయించింది హై-పవర్ కమిటీ. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సభ్యులందరికీ సమాచారం అందించారు. ఈరోజు జరగనున్న సమావేశంలో అమరావతి సమగ్రాభివృద్ధితో పాటు భూములు ఇచ్చిన రైతుల్ని ఎలా ఆదుకోవాలనే అంశంపై కీలకంగా చర్చిస్తారు.
రాజధాని పేరట అమరావతి రైతుల్ని మోసం చేసి, వాళ్లకు అరచేతిలో స్వర్గం చూపించి, ల్యాండ్ పూలింగ్ పేరిట భూములు లాక్కున్నారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. తర్వాత వాటన్నింటినీ చదును చేసి, తన అస్మదీయులతో రియల్ ఎస్టేట్ దందాకు తెరదీశారు. ఐదేళ్లలో రాజధాని ప్రాంతం అంగుళమైనా అభివృద్ధి చెందక, రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందక అమరావతి అభివృద్ధి గాల్లో దీపంగా మారింది. అప్పట్లో బాబు చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు జగన్ కు తలనొప్పిగా మారాయి. గత ప్రభుత్వం ప్రకటించినట్టుగా రైతులకు పరిహారం అందించడంతో పాటు అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యతను ఇప్పుడు జగన్ తీసుకున్నారు.
రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, వాళ్లు నష్టపోకుండా మంచి ప్యాకేజీలు అందించే దిశగా హై పవర్ కమిటీ కొన్ని సూచనలు చేయబోతోంది. దీంతో పాటు రాజధానిని తరలిస్తే, అమరావతి భూముల్ని ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై కూడా కొన్ని కీలక సూచనలు చేయబోతున్నారు. ప్రస్తుతం అమరావతి రైతుల దృష్టి మొత్తం ఈరోజు జరగబోయే హై పవర్ కమిటీ భేటీపైనే ఉంది.
అయితే ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి వెలువడే అవకాశం లేదు. ఎందుకంటే, కమిటీ మరో 2సార్లు భేటీ అవుతుంది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలపై సమగ్రంగా చర్చిస్తుంది. 20వ తేదీన తుది నివేదికను ముఖ్యమంత్రి జగన్ కు అందిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా కేబినెట్ లో చర్చించి, ఆ తర్వాత నిర్ణయాల్ని వెల్లడిస్తారు.