ఎట్టకేలకు రాజధాని రైతులకు సినీ రంగం నుంచి హీరో నారా రోహిత్ సంఘీభావం తెలిపాడు. ఓకే బాగానే ఉంది. రెండు రోజుల క్రితం నటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి విజయవాడలో మాట్లాడుతూ సినీరంగం కూడా రాజధాని రైతులకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. కానీ ఏ ఒక్కరి నుంచి కూడా కనీస స్పందన రాలేదు.
జగన్ సర్కార్ అభివృద్ధి వికేంద్రీకరణకు తీసుకుంటున్న చర్యలకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికిన విషయం తెలిసిందే. చిరంజీవి మద్దతు జగన్‌కు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. హీరో పవన్‌కల్యాణ్ రాజధాని రైతులకు అండగా నిలిచాడు. కానీ ఆయన్ను జనసేన నాయకుడిగానే చూస్తున్నారు. అందువల్ల ఆయన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కావడంతో పాటు, జనసేన ఏకైక ఎమ్మెల్యే వరప్రసాద్ మూడు రాజధానులకే జై కొట్టాడు.
ఈ నేపథ్యంలో నందమూరి హీరోలపై అందరి దృష్టి పడింది. నందమూరి బాలకృష్ణ రాయలసీమలోని హిందూపురం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రాజధాని రైతులు 23 రోజులుగా ఆందోళన చేస్తున్నా బాలకృష్ణ కనీసం నోరు తెరిచిన పాపాన పోలేదు. అమరావతిలో బావ నారా చంద్రబాబునాయుడి కుటుంబంతో కలిసి సంక్రాంతి జరుపుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఆ సందర్భంగా ఏమైనా ఆయన మాట్లాడుతారేమో చూడాలి.
మరో యువ నటుడు జూనియర్ ఎన్టీఆర్. యూత్‌లో క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు, మరీ ముఖ్యంగా చంద్రబాబు కుటుంబానికి సుదూరంలో ఉన్నాడు. తండ్రి హరికృష్ణ చనిపోయిన సందర్భంలో చంద్రబాబుతో కలవడం తప్ప, మరెప్పుడూ వారితో కలిసిన దాఖలాలు లేవు. 2018లో సొంత అక్క సుహాసిని కూకట్‌పల్లి నుంచి టీడీపీ తరపున పోటీ చేసినా…కనీసం అటువైపు కూడా తొంగి చూడలేదు.
ప్రస్తుతం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు కుమారుడైన హీరో రోహిత్ రాజధాని రైతుల ఆందోళనపై స్పందించాడు. రైతుల పోరాటం వృథా కాదని రోహిత్ ప్రకటించిన నేపథ్యంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ స్పందనలపై అందరి దృష్టి పడింది.