సీమ‌కు, కృష్ణా నీళ్లు ఎంత దూర‌మో చెప్పండి?

అబ్బో ఎంత ప్రేమ‌. విశాఖ‌కు రాజ‌ధాని త‌ర‌లిస్తే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల‌కు స‌చివాల‌యం దూర‌మ‌ని ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి య‌జ‌మానులు రామోజీరావు, రాధాకృష్ణ‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, సీపీఐ నేత నారాయ‌ణ‌…ఇలా అంద‌రూ…

అబ్బో ఎంత ప్రేమ‌. విశాఖ‌కు రాజ‌ధాని త‌ర‌లిస్తే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల‌కు స‌చివాల‌యం దూర‌మ‌ని ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి య‌జ‌మానులు రామోజీరావు, రాధాకృష్ణ‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, సీపీఐ నేత నారాయ‌ణ‌…ఇలా అంద‌రూ ముక్త కంఠంతో సీమ కోసం ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. విశాఖపట్నం 141 నియోజకవర్గాలకు, 70% ప్రజలకు దూరమని రామోజీరావు లెక్క‌లేసి మ‌రీ తేల్చి చెబుతున్నాడు.

మ‌రి ద‌గ్గ‌ర్లో ఉన్న అమ‌రావ‌తి భూముల్లో పంట‌లు ఎందుకు పండుతున్నాయ్‌, రాయ‌ల‌సీమ‌లో ఎందుకు ఎండుతున్నాయ్‌?  వారి మాట‌ల్లో చెప్పాలంటే క‌నుచూపు మేర‌లో ఉన్న అమ‌రావ‌తి భూముల‌కు ఎందుకంత రేటు, సీమ భూముల‌కు ఎందుకంత త‌క్కువ‌?  డెల్టా ప్రాంత రైతులు పంట‌ల సాగుతో కోట్ల‌కు ‘ప‌డ‌గ‌’లెత్తుతుంటే, కృష్ణా జ‌లాల‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న సీమ రైతాంగం అప్పుల‌తో ‘పాడె’ ఎందుకు ఎక్కాల్సి వ‌స్తోంది. బ‌తుకుల్లో ఈ ‘దూరం’ ఎందుకు, ఎప్ప‌టి నుంచి?

రాకపోకలకే రెండ్రోజులని ‘అయ్యో పాపం రాష్ట్ర ప్రజలకు ఎన్ని కష్టాలొచ్చి పడ్డాయని’ అక్షరాలన్నీ కన్నీటి పర్యంతమయ్యాయి. అమరావతి బెల్లానికి మరిగినోళ్ల‌కి అన్నీ దూరమే. కానీ అది బయటకి చెప్పరు, చెప్ప‌లేరు. అక్కడ విశాఖపట్నం బెల్లం తియ్య‌గా లేదనో, ఇటు కర్నూలు బెల్లం ‘కమ్మ’గా లేదనో కొన్ని కట్టు కథలల్లి, ఎటు తిరిగి జనాల మెదడును అమరావతి వైపు ‘బెండ్’ చెయ్యాలనే బెండకాయ సిద్ధాంతం మరి.

అయ్యా రామోజీ, రాధాకృష్ణ‌, చంద్ర‌బాబు, లోకేశ్, సీపీఐ రామ‌కృష్ణా తదిత‌ర పే…ద్ద మ‌నుషుల్లారా మీరు విశాఖ‌-రాయ‌ల‌సీమ జిల్లాల మ‌ధ్య దూరం భౌగోళిక అంశానికి మాత్ర‌మే ప‌రిమిత‌మై మాట్లాడుతున్నారు. కానీ మాన‌సిక దూరం పెరిగింది. దానికి కార‌ణం నీళ్లే.

అయ్యా…మరి రాయ‌ల‌సీమ నీటి దూరాల కథ కూడా వినండి, క‌నండి. కర్నూల్ కాళ్ల కింద పారే కృష్ణా నీళ్లు రాయలసీమ కాలువలకెక్కి కరవు నేల బీడు భూముల్లో పారాలంటే ఎంతెంత దూరమో మీరే చెప్పండి?

బతావత్ కమిషన్ ప్రకారం తుంగభద్ర నుంచి కృష్ణాలోకి చేరాల్సిన‌ నీటి వాటా 31.45 TMC లు. కానీ 2004-05 నుంచి 2013-14 వరకు ప్రతి సంవత్సరం సుమారు 240 TMC లు చేరాయని లెక్కలు చెబుతున్నాయి. అంటే 210 TMCల నీళ్లు కేవలం తుంగభద్ర నుంచి కృష్ణాకి అదనంగా చేరుతున్నాయి. ఈ సంవత్సరం ఈ లెక్క ఆకాశానికి అంటి దాదాపు 500 TMC లు కృష్ణాలో చేరాయి.

తుంగభ‌ద్ర‌ నుంచి సీమ ఎంతెంత దూరమో లెక్కేయ‌రూ!

క‌ర‌వు నేల రాయ‌ల‌సీమ‌ది ద‌ప్పిక, ఆక‌లి బాధ‌. వాటికి తాగేందుకు గుక్కెడు, క‌నీసం ఒక్క పంటైనా పండించుకునేందుకు బిందెడు నీళ్లు కావాలి. ఆ నీళ్లు… రాయ‌ల‌సీమ‌కు ఎంత దూర‌మో లెక్కేయండి సార్‌.

బక్కచిక్కిన రాయలసీమ రైతుల గొంతులను తడపలేని ఈ నీళ్లు, చుక్క నీళ్లకు నోచుకోని కరవు నేలను దాటి, కటిక జీవులను దాటి, ఇక్కడ రైతుల ఉరితాళ్లను, స్మశానాలను తలపించే ఊర్లను దాటి, శ్రీశైలం గేట్లు దాటి, సాగర్ తలుపులు తెరచుకుని ఎక్కడెక్కడో రొయ్యల చెరువులకు, చేపల చెరువులకు ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరని బకాసురుల బాన కడుపులకు కాలువలెక్కి ఎలా పారుతున్నాయో చెప్పగలరా!

ఈ నీళ్లు లేకే కదా రాయలసీమలోని గాలివీడు బిడ్డలు పూణె, ముంబయి రెడ్ లైట్ ఏరియాల్లో అత్యంత అమానవీయ పరిస్థితుల్లో బ‌తుకెళ్ల‌దీస్తున్నారు. ఉపాధి కోసం దిక్కులు, ఎల్ల‌లు లేని, గ‌మ్య‌మెక్క‌డో తెలియ‌క బ‌తుకు ప్ర‌యాణం చేస్తున్న‌ క‌ర‌వు బిడ్డ దూరాభారాల గురించి ఏనాడైనా మాట్లాడారా? ఒక్క అక్ష‌రం రాశారా?

ఈ నీళ్లు లేకనే కదా ఉన్న ఊరిని, కన్న పిల్లలను వదిలి రాయ‌ల‌సీమ‌ సన్నకారు రైతులు కువైట్‌, మస్కట్, దుబాయ్ దేశాల‌కు కూలీనాలీకి పోయి కూలిపోయి శవాలై తిరిగొస్తున్నది.

అయ్యా మరి   సీమకు పూణె ఎంతదూరమో మీ దూరమీటర్ దృష్టికి రాలేదా? రాయ‌ల‌సీమ నుంచి దుబాయ్‌కి ఎంత దగ్గరి దాపో కదా! అందుకే ఆ దూరాన్ని మీరు విస్మరించారు కదా!

కర్నూల్‌కు కూతవేటు దూరంలో శ్రీశైలం పెట్టుకుని, వాటర్ బోర్డును విజయవాడలో పెట్టడం ఏ దూర ప్రామాణికమో మీరే రాయాలి. అనంతపురం నుంచి మంగళగిరికి గత ప్రభుత్వ హయాంలో తరలిపోయిన AIIMS కు ఏ దూరం ఎందుకు అడ్డు రాలేదో మీరే చెప్పాలి.

ఇక చివరగా 14 ఏండ్లు పరిపాలించి, అబద్ధాల్లో ప్రపంచంలోనే ఆస్కార్‌కు ఏకగ్రీవంగా ఎన్నిక కాగలిగి, అన్నీ కనుగొన్న బాబు గారు, రాయలసీమను అటుంచి తన సొంత జిల్లా అయిన చిత్తూరులో ఒక్కటంటే ఒక్క బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టక పోవడానికి, ఆయనే కోస్తా ప్రాంతంలోని అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని భ్రమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికి ఏది దూరమో ఏది దగ్గరో మీరే రాయాలి. అప్పుడు కదా అసలు దూరం కథ ప్రజలకు తెలిసేది.

కాలానికి దారం ప‌ట్టి దూరం కొలుస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే దాదాపు రాయ‌ల‌సీమ సాగునీళ్ల‌కు సంబంధించి ఒక్క ప్రాజెక్టును కూడా ఈ తెలుగు జాతి చేప‌ట్ట‌లేదు. క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర నుంచి వ‌చ్చే నీళ్లు ఏ లెక్క‌న రాయ‌ల‌సీమ‌కు దూర‌మై, కృష్ణా జిల్లాకు చేర‌వ‌య్యావో ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంది.  

సొదుం ర‌మ‌ణారెడ్డి