పృథ్వీకి పోసాని… పంచ్ పడింది!

పెదవి దాటితే పృథివి దాటుతుందని సామెత. నోటిని అదుపులో పెట్టుకోవాలని ఈ సామెత నీతి. ఒకసారి ఒక మాట నోరు జారిందంటే గనుక, ఇక భూమండలం మొత్తం వ్యాపించి పోతుందని, దానిని అడ్డుకోవడం సాధ్యం…

పెదవి దాటితే పృథివి దాటుతుందని సామెత. నోటిని అదుపులో పెట్టుకోవాలని ఈ సామెత నీతి. ఒకసారి ఒక మాట నోరు జారిందంటే గనుక, ఇక భూమండలం మొత్తం వ్యాపించి పోతుందని, దానిని అడ్డుకోవడం సాధ్యం కాదని ఈ నీతి చెబుతుంది. కానీ తమాషా ఏంటంటే.. నోటిమీద అదుపులేకపోతే.. పృథ్వికి కూడా పంచ్ తప్పదు. ఇక్కడ పృథ్వి అంటే భూమి కాదు… ఎస్వీబీసీ ఛానెల్‌కు ఛైర్మన్‌గా పదవిలో ఉన్న.. కమెడియన్ పృథ్వీరాజ్ సంగతి.

ఇటీవలి కాలంలో.. ప్రత్యర్థి ఎంతటివాడు అనేది ఏమాత్రం ఖాతరు చేయకుండా.. నోటికి ఎంత వస్తే అంత మాటలు అనేయడం ద్వారా.. అత్యంత వివాదాస్పదుడైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కమెడియన్ పృథ్వీ. కమెడియన్‌గా తనకున్న హోదాతోనే.. మీడియా ముందుకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేయగల స్థాయి ఆయనకు ఉండేది. అప్పట్లోనే ఇండస్ట్రీలో చాలావరకు తెలుగుదేశం పంచన ఉండిపోగా.. పృథ్వీమాత్రం.. తొలినుంచి జగన్‌నే నమ్ముకుని ఆయనకు అనుకూలంగానే మాట్లాడుతూ వచ్చారు. అధికారంలోకి రాగానే ఎస్వీబీసీ పదవి దక్కించుకున్నారు.

ఆ తర్వాత ఇంకాస్త డోసేజీ పెంచారు. రాజకీయ ప్రత్యర్థులను తిట్టడంలో ఆయన కామెంట్లు శృతిమించుతున్నా ప్రజలు కూడా ఎంజాయి చేస్తున్నారు. అయితే ఏకంగా ప్రజలనే తిడితే ఎలా ఉంటుంది. అమరావతి రైతులు ఉద్యమిస్తోంటే.. వారందరినీ కూడా పెయిడ్ ఆర్టిస్టులంటూ ఒకే గాటన కట్టేసేసరికి.. ఆ పార్టీకే చెందిన వాడే అయినప్పటికీ.. మరో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి కోపం వచ్చింది. ఆ  మాటకొస్తే.. నోటికి ఏం వస్తే అది మాట్లాడడంలో పోసాని కూడా ఉద్ధండుడే.

ఒకవైపు  చంద్రబాబును కూడా నిందిస్తూనే.. రైతులను, ఆడపడుచులను పెయిడ్ ఆర్టిస్టులంటావా అంటూ పృథ్వీపై విరుచుకుపడ్డారు. జగన్‌ను ప్రభుత్వాన్ని నాశనం చేయడానికే మీ లాంటి వాళ్లు పుట్టారు.. సిగ్గుపడండి అంటూ తీవ్రపదజాలంతోనూ దూషించారు. చంద్రబాబును బద్నాం చేయడంలో పోసాని కూడా వైకాపాకు గతంలో చాలా అండగా నిలిచారు. కానీ.. పోసానికి ఏమీ పదవి రాలేదు. ఈ నేపథ్యంలో  ఆయన పృథ్వీపై ఆవేశంగా చేసిన కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.