ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడడం లేదు. తాను తలపెడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలలో అపోహలు కలిగించడానికి ప్రయత్నిస్తూ అడ్డదిడ్డమైన కుట్రలకు పాల్పడుతున్న వారిలో ఈనాడు దినపత్రిక, చంద్రబాబు నాయుడు లను కూడా జగన్ సహించగలుగుతున్నారు గాని.. పవన్ కళ్యాణ్ పేరెత్తడానికి కూడా ఇష్టపడడం లేదు. అమ్మ ఒడి ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు.
రాజకీయ నాయకులు తాము తక్కువ చేయదలుచుకున్న ప్రత్యర్థులను పేరు కూడా ఉచ్చరించకుండా… తక్కువ స్థాయికింద కట్టడం కొత్త టెక్నిక్ ఎంత మాత్రము కాదు. కేసీఆర్ ఈ విషయంలో తల పడిపోయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్న కాలం నుంచి… దానిని వ్యతిరేకిస్తున్న అనేక మందిని ఆయన ఈ తరహాలోనే ట్రీట్ చేశారు. తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పలు సందర్భాలలో ఇలాగే స్పందించారు.
ప్రత్యర్థులైన నాయకుల విషయంలో ఇలా చేయడం ఒక ఎత్తు. కేబీఆర్ పార్క్ వద్ద సంఘటన జరిగితే… అసెంబ్లీలో మాట్లాడుతూ… కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు చెప్పడానికి కూడా తనకు ఇష్టం లేదని కేసీఆర్ అన్నారు. అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా, ‘వాడెవడో సినీ యాక్టర్ ఉండాలి’ అంటూ మాట్లాడే వాళ్లు. అప్పటి నుంచి చాలామంది నాయకులకు ప్రత్యర్థులను చులకన చేయడానికి ఇది ఒక సులువైన మార్గంగా మారింది. ఇప్పుడు అదే టెక్నిక్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి కూడా అనుసరిస్తున్నారు.
జగన్మోహన రెడ్డి.. తాను సంకల్పిస్తున్న ఇంగ్లిషు మీడియం విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై నిప్పులు చెరిగారు. దానికి అడ్డుపడుతున్న వారిని తప్పుపట్టారు. ఈ సందర్భంలోనే.. పేదపిల్లలకు ఇంగ్లిషు మీడియం విద్య అందుబాటులోకి తేవాలని చూస్తోంటే… ఆడిపోసుకుంటున్నారని ఆయన అన్నారు.
ఈ ఇంగ్లిషు మీడియమే కావాలంటూ… చంద్రబాబునాయుడు, ఈనాడు, ఒక యాక్టరు లకు వినిపించేలా ప్రజలందరూ గట్టిగా అరిచి చెప్పాలని జగన్ పిలుపు ఇచ్చారు. తెలుగు మీడియం ఉండాల్సిందే అనే వాదనతో పవన్ కళ్యాణ్ సదస్సులు కూడా నిర్వహిస్తూ… జగన్ ఆడిపోసుకుంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఈ విషయంలో గొంతు తగ్గించారు. పైగా పవన్ మాటలు ఏమాత్రం తర్కంలేకుండా అడ్డగోలుగా కూడా ఉంటుంటాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి… పవన్ కళ్యాణ్ పేరు పలకడానికి కూడా ఇష్టపడడం లేదని విశ్లేషకులు అనుకుంటున్నారు.