టీడీపీకి ప‌వ‌న్‌తో ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌!

ఇళ్ల‌ల‌క‌గానే పండ‌గ కాద‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిరూపించారు. త‌న పార్టీ విస్తృత‌స్థాయి స‌మావేశంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌సంగం టీడీపీని షాక్‌కు గురి చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించే ఏకైక పార్టీ టీడీపీ మాత్ర‌మే…

ఇళ్ల‌ల‌క‌గానే పండ‌గ కాద‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిరూపించారు. త‌న పార్టీ విస్తృత‌స్థాయి స‌మావేశంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌సంగం టీడీపీని షాక్‌కు గురి చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించే ఏకైక పార్టీ టీడీపీ మాత్ర‌మే అని ప‌వ‌న్ గుర్తించి, బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇచ్చి, పొత్తులో భాగంగా క‌లిసి ప‌ని చేస్తామ‌ని ప్ర‌క‌టించిన‌ట్టు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌లు రెండు రోజులుగా ఊరూ వాడా దండోరా వేస్తున్నారు.

ఇలాంటి ప్ర‌చారానికి ముగింపు ప‌లుకుతూ ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ ఆందోళ‌న చెందుతోంది. క‌నీసం చంద్ర‌బాబునాయుడిని సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్ గుర్తించ‌క‌పోవ‌డం ఏంట‌నే ప్ర‌శ్న టీడీపీని క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇదంతా బీజేపీ మైండ్‌గేమ్‌లో భాగంగా జ‌రుగుతోందా? అనే అనుమానిస్తోంది. ప‌వ‌న్‌ను సీఎం అభ్య‌ర్థిగా ముందుకు తెస్తుందా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. జ‌న‌సేన విస్తృత‌స్థాయి సమావేశంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏమ‌న్నారంటే…

“ప్ర‌ధాని మోదీ మ‌ద్ద‌తుతో ,తెలుగుదేశం పార్టీతో క‌లిసి వెళ్లాల‌ని తీసుకున్న నిర్ణ‌యాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు హ‌ర్షించారు. అధికారంలో వాటా, రాజు ఎవ‌రు, మంత్రి ఎవ‌రు అనేది వైసీపీని ఓడించిన త‌ర్వాతే తేల్చుకుందాం. టీడీపీతో అధికారం ఎలా పంచుకోవాలి? ముఖ్య‌మంత్రి స్థాన‌మా? మ‌రొక‌టా? అనేది త‌ర్వాత ఆలోచిద్దాం. మ‌నం ఎన్డీఏలోనే ఉన్నాం. బీజేపీతోనే ఉన్నాం. న‌రేంద్ర మోదీతోనే ఉన్నాం. జ‌న‌సేన ఎప్పుడూ ఎన్డీఏలో భాగ‌మే. మ‌నం ఎన్డీఏ నుంచి బ‌య‌టికి రావ‌డం లేదు”

ప‌వ‌న్ బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇచ్చార‌ని టీడీపీ చేస్తున్న ప్ర‌చారానికి ప‌వ‌న్ చెక్ పెట్టిన‌ట్టైంది. అస‌లు చంద్ర‌బాబునాయుడు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి కాద‌ని, మొద‌ట జ‌గ‌న్‌ను గ‌ద్దె దించిన త‌ర్వాతే మిగిలిన సంగ‌తుల‌న్నీ అని ఆయ‌న తేల్చి చెప్పారు. దీంతో టీడీపీ-జ‌న‌సేన కూట‌మి సీఎం అభ్య‌ర్థి ఎవ‌రో తేల్చుకోకుండానే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్న‌ట్టు ప‌వ‌న్ చెప్ప‌కనే చెప్పారు. దీంతో ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన కూట‌మికి మెజార్టీ స్థానాలు ద‌క్కినా సీఎం కుర్చీ కోసం ఫైట్ త‌ప్ప‌ద‌నే ప్ర‌చారానికి తెర‌లేచింది. ఎందుకంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను సీఎంగా చూడాల‌ని ఆయ‌న అభిమానులు ప‌రిత‌పిస్తున్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబునాయుడు మిన‌హా మ‌రెవ‌రిని సీఎంగా టీడీపీ శ్రేణులు, ఎల్లో మీడియా అంగీక‌రించ‌వు.

దీంతో ప‌వ‌న్ కామెంట్స్ ఆదిలోనే టీడీపీలో అనుమానాన్ని, ఆందోళ‌న‌ను క‌లిగిస్తున్నాయి. ఇంకా ఎవ‌రెన్ని సీట్ల‌లో పోటీ చేయాల‌నే విష‌యం తేల‌కుండానే సీఎం పీఠంపై ప‌వ‌న్ క‌న్నేయ‌డం ఏంట‌ని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది. ఒక‌వైపు జ‌గ‌న్‌ను గ‌ద్దె దింపేందుకు టీడీపీకి ఎలాంటి ష‌ర‌తులు లేకుండా మ‌ద్ద‌తు ఇస్తాన‌ని చంద్ర‌బాబు వ‌ద్ద చెప్పి, ఇప్పుడేమో ఇలా మాట్లాడ్డం దేనికి సంకేత‌మ‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం నిల‌దీస్తోంది.

ఇప్పుడే ఇలా మాట్లాడితే, రేపు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఊరికే వుంటారా? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. అస‌లే ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిల‌క‌డ లేని నాయ‌కుడ‌ని, ఆయ‌న గ‌త ప‌దేళ్ల‌లో వేసిన పిల్లి మొగ్గ‌లు మ‌రే పార్టీ అధినేత వేసి వుండ‌ర‌ని, ఆయ‌న్ను న‌మ్మి ముందుకెళితే అంతే సంగ‌తుల‌నే ఆందోళ‌న టీడీపీలో క‌నిపిస్తోంది. జ‌న‌సేన‌తో పొత్తుతో సంబ‌ర‌ప‌డ‌డం ప‌క్క‌న పెడితే, ముందుంది ముస‌ళ్ల పండ‌గ అని ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న కామెంట్స్‌తో వార్నింగ్ ఇచ్చార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.