అందరికీ అన్నీ ఇస్తున్నారు.. మా సంగతేంటి జగన్..?

అడిగినవారికి, అడగని వారికి అందరికీ ఏదో ఒకటి ఇస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఎక్కడో తప్పు జరిగి ఆర్థిక సాయం పడనివారికి మరో దఫా పిలిచి మరీ ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది మా…

అడిగినవారికి, అడగని వారికి అందరికీ ఏదో ఒకటి ఇస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఎక్కడో తప్పు జరిగి ఆర్థిక సాయం పడనివారికి మరో దఫా పిలిచి మరీ ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది మా సంగతేంటని అంటున్నారు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు. 

ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారో ఎమ్మెల్యేలు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కోసం కాచుకు కూర్చున్నారు. పెద్ద పండగ తర్వాతయినా ఎమ్మెల్యేలకు పండగ ఉంటుందా..? కొత్త ఏడాది అయినా జాతకాలు మారతాయా..? అమాత్యులయ్యే యోగం ఉందా..? అని ఎదురు చూస్తున్నారు.

రెండేళ్లవుతున్నా.. తేల్చరేంటి..?

రెండేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని మారుస్తామంటూ ప్రమాణ స్వీకారం రోజే సీఎం జగన్ ప్రకటించారు. ఆ మధ్య బాలినేని కూడా మొత్తం మార్చేస్తారు, మేం కూడా పదవుల్లో ఉండం అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో చాలామంది ఆశావహులు అమాత్య యోగంపై నమ్మకం పెట్టుకున్నారు. 

తీరా రోజులు గడుస్తున్నాయి, నెలలు మారిపోయాయి. ఏకంగా కొత్త ఏడాది వచ్చేసింది. ఇంకా జగన్ నుంచి ఉలుకు పలుకు లేదు. అసలు మంత్రి వర్గంలో మార్పులుండొచ్చనే సిగ్నల్ కూడా లేదు. దీంతో వారంతా మళ్లీ నిరాశలో మునిగిపోయారు.

సంక్రాంతి తర్వాత మహూర్తం..?

దసరా అయిపోయింది. దీపావళి పోయింది, కొత్త ఏడాది కూడా వచ్చేసింది. తీరా ఇప్పుడు సంక్రాంతిని కొత్త మహూర్తంగా చెబుతున్నారు. కనీసం ఇప్పుడయినా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందా..? లేక పాత జట్టునే మరికొన్నాళ్లు కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది.

ఇటీవల ఏపీలో కాపు రచ్చ కొత్తగా మొదలైంది. రాధా రెక్కీ ఆరోపణలో కాపు వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాపులంతా సమావేశమై ప్రత్యేక పార్టీ కూడా పెట్టాలనుకుంటున్నట్టు బయటకు సిగ్నల్స్ పంపించారు. అంటే రేపు మంత్రి వర్గ విస్తరణ పెట్టుకుంటే కాపులకు కచ్చితంగా అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దశలో జగన్ తేనె తుట్టెను కదిపే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి.