ప్ల‌వ నామ సంవ‌త్స‌రం.. శుభకృత్ కు దాటిస్తుందా!

తెలుగు సంవ‌త్స‌రాలు అర‌వై. వాటికి ప్ర‌త్యేక‌మైన పేర్లు. ప్ర‌తి సంవ‌త్స‌రం పేరు వెనుకా గూఢార్థం ఉందంటారు పంచాంగ క‌ర్త‌లు. అర‌వై సంవ‌త్స‌రాలు పూర్తైన త‌ర్వాత‌, మ‌ళ్లీ అవే పేర్లే రిపీట్ అవుతాయి. మ‌రి ఈ…

తెలుగు సంవ‌త్స‌రాలు అర‌వై. వాటికి ప్ర‌త్యేక‌మైన పేర్లు. ప్ర‌తి సంవ‌త్స‌రం పేరు వెనుకా గూఢార్థం ఉందంటారు పంచాంగ క‌ర్త‌లు. అర‌వై సంవ‌త్స‌రాలు పూర్తైన త‌ర్వాత‌, మ‌ళ్లీ అవే పేర్లే రిపీట్ అవుతాయి. మ‌రి ఈ సంవ‌త్స‌రాల పేర్లు కొన్ని పాజిటివ్ సౌండ్ లో ఉంటే, మ‌రి కొన్ని నెగిటివ్ సౌండ్ లో ఉంటాయి. సంవ‌త్స‌రం పేరు ఎలా ఉన్నా.. వాటి పేర్ల‌ను మాత్రం మంత్రోచ్ఛ‌రణ‌లోనూ, పూజ‌ల్లోనూ ప్ర‌స్తావిస్తూనే ఉంటారు.

ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే.. వ‌చ్చేది శుభ‌కృత్ నామ సంవ‌త్స‌రం. 2022లో వ‌చ్చే ఉగాదితో శుభ‌కృత్ నామ సంవ‌త్స‌రం మొద‌లు కానుంది. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న‌ది ప్ల‌వ‌ నామ సంవ‌త్స‌రం. సంవ‌త్స‌రాల పేర్ల వెనుక ఉన్న అర్థాల‌ను గ‌మ‌నిస్తే.. ఒకింత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం త‌డుతుంది.

వీటికి ముందు సంవ‌త్స‌రం పేరు .. శార్వ‌రి. అంటే అర్థం చీక‌టి. దేశంలోని స‌గ‌టు మ‌నిషి ప‌రిస్థితిని చూస్తే.. ఆ సంవ‌త్స‌రం నుంచినే చీక‌టి మొద‌లైంది. 2020 ఉగాది, 2021 ఉగాది ల మ‌ధ్య‌న శార్వ‌రి సంవ‌త్స‌రం వ‌చ్చింది. 2020 ఉగాది స‌మ‌యం నుంచి క‌రోనా ప్ర‌భావం దేశంలో మొద‌లైంది! అక్క‌డ నుంచినే కోట్ల మంది జీవితాల్లో చీక‌టి గోచ‌రించింది.

2020 ఉగాది త‌ర్వాత క‌రోనా విల‌య‌తాండ‌వం చేసింది. ఆ త‌ర్వాత నెమ్మ‌ది నెమ్మ‌దిగా క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టినా.. చాలా వ‌ర‌కూ వ్య‌వ‌స్థ‌లు కుదేల‌య్యాయి. చాలా మంది ఉపాధి దెబ్బ తింది. మాన్యులు, సామాన్యులు తేడా లేకుండా.. ఇబ్బందులు ప‌డ్డారు. 

డ‌బ్బుండి, క‌రోనా సోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్న వారు కూడా… త‌మ వ్య‌క్తిగ‌త జీవితంలో స్వ‌తంత్రాన్ని కోల్పోయారు. స్వేచ్ఛ‌గా సంచ‌రించ‌లేక‌పోయారు. అన్నీ ఉన్నా ఇంటికే ప‌రిమితం కాక త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితి. చీక‌టిలో మ‌గ్గారు! రెక్కాడితే త‌ప్ప డొక్కాడ‌ని వారికి.. ఉపాధి మార్గాలు దెబ్బ‌తిని బ‌తుకు చీక‌టి కాగా, అన్నీ ఉన్న వారు డ‌బ్బు ఖ‌ర్చు పెట్టుకోవ‌డానికి, స్వేచ్ఛ‌గా తిర‌గ‌డానికి లేక ఇబ్బంది ప‌డ్డారు. ఎలాగైతేనేం.. చీక‌టే!

ఇక 2021 ఉగాదితో ప్ల‌వ నామ సంవ‌త్స‌రం మొద‌లైంది. ప్ల‌వ అంటే అర్థం దాటించున‌ది అని. శార్వ‌రి అంటే చీక‌టి, ప్ల‌వ అంటే దాటించేది. మ‌రి రాబోయేది శుభ‌కృత్! వ‌చ్చే ఉగాది త‌ర్వాత శుభ‌కృత్ నామ సంవ‌త్స‌రం ప్రారంభం కానుంది. 2020 ఉగాదితో చీక‌టి మొద‌లైతే, 2021తో చీక‌టి నుంచి దాటించే ప్ల‌వ మొద‌లైంది. 2022 ఉగాదితో శుభ‌కృత్ ప్రారంభం కానుంది. 

మ‌రి ఈ సంవ‌త్స‌రాల పేర్లు.. వాస్త‌వ ప‌రిస్థితుల‌కు అన్వ‌యం కుదిరేలా ఉన్నాయి. శార్వ‌రి చీక‌ట్లు తొల‌గి, శుభ‌కృత్ కు ప్ల‌వ నామ‌సంవ‌త్స‌రం దాటిస్తుంద‌ని ఆశిద్ధాం. క‌రోనా గురించి అధ్య‌య‌నాలు చేస్తున్న వాళ్లు కూడా.. ఒమిక్రాన్ వేరియెంట్ రాబోయే రెండు నెల‌లూ తీవ్రంగా వ్యాపించ‌వ‌చ్చ‌ని, ఇది క‌రోనాకు క్లైమాక్సే అని అంటున్నారు. మ‌రి ఆ క్లైమాక్స్ .. బ‌హుశా ఈ సారి వ‌చ్చే ఉగాది నాటికి, శుభ‌కృత్ నామ సంవ‌త్స‌రం ప్రారంభానికి జ‌రుగుతుంద‌ని ఆశిద్దాం.