తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సంతకాల సేకరణ అనే కొత్త ప్రహసనాన్ని తెరతీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి మరొక చోటికి తరలించడం అనే ప్రక్రియకు అడ్డుపడడంలో కొత్త పుంతలు తొక్కుతోంది.
రాజధాని అమరావతి ప్రాంతంలో మాత్రమే ఉండాలి అనే తెలుగుదేశం వాదనకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సరిగా మద్దతు లభించడం లేదు. ఈ బలహీనత బయటపడకుండా ఏదో ఒక మాయ చేయడానికి చూస్తున్న తెలుగుదేశం అందుకు సంతకాల సేకరణను ఉత్తమ మార్గంగాఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది.
జగన్ పరిపాలన రాజధానిని విశాఖకు తరలించడానికి నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో సర్వత్ర హర్షామోదాలు అవుతున్నాయి. తమ ప్రాంత అభివృద్ధికి జగన్ దృష్టి పెట్టారని ఆ ప్రాంతంలో పండుగ చేసుకుంటున్నారు.
అయితే జగన్ ప్రభుత్వం మీద నిందలు వేయడం ఒక్కటే తమ లక్ష్యం… అన్నట్లుగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం నాయకులు. దీనికి మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు రాజు సారథ్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రజలు, జగన్ ఆలోచనను వ్యతిరేకిస్తున్నారని చాటి చెప్పడం వారి ప్రధాన లక్ష్యం.
కానీ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలలో, ప్రజాందోళనలు చేపట్టి ఉంటే గనుక పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఆ ప్రాంతాల్లో ప్రజలను సమీకరించే తెగువ తెలుగుదేశానికి లేదు. అందుకే సంతకాల సేకరణ పేరుతో ఒక మాయ కు శ్రీకారం చుట్టారు. ఈ ముసుగులో అయితే రోడ్డు పక్కన గుడారం వేసుకొని కూర్చుంటే సరిపోతుంది. పట్టుమని పది మంది తమ వద్దకు వచ్చి సంతకాలు చేయకపోయినా సరే… సాయంత్రానికి కొన్ని లక్షల మంది ప్రజలు సంతకాలు చేసినట్లుగా రికార్డులు పుట్టించడమూ సాధ్యమవుతుంది. వాటికి ఆధారాలు అడిగే దిక్కు ఉండదు… చెప్పే జవాబుదారీతనం ఎవ్వరిలోనూ ఉండదు.
పైకి మాత్రం తాము సేకరించిన సంతకాల రూపేణా ఇంతమంది వ్యతిరేకిస్తున్నా.. నిర్ణయాలు తీసుకుంటారా.. అని ప్రభుత్వం మీద నిందలు వేయడానికి మార్గం దొరుకుతుంది. అందుకే… పచ్చదళాలు ఇలాంటి వంకర మార్గాన్ని ఎంచుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.