ప్రత్యర్థి దమ్మును ప్రశ్నించడం ప్రతిఒక్కరికీ ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది. ఏదో ఒక నింద వేయడం.. దమ్ముంటే నిరూపించుకోమని అనడం.. అంతటితో ఆ వ్యవహారాన్ని వదిలేసి పక్కకు మళ్లిపోవడం రివాజు అయింది. దమ్ముందా అని ప్రశ్నిస్తే.. మీడియాలో కవరేజీ బాగుంటుందనే అభిప్రాయం ఏర్పడిందో ఏమో గానీ.. ప్రతి ఒక్కరూ ఇలాంటి విమర్శలే చేస్తున్నారు. అందరూ విమర్శించడం ఒక ఎత్తు. నలభయ్యేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు కూడా అదే తరహా మాటలు అనడం ఒక ఎత్తు. ఆయన జగన్మోహన రెడ్డికి దమ్ముంటే అంటూ ఒక సవాలు విసిరారు.
జగన్ కు దమ్ముంటే ధైర్యముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలట. అప్పుడు కూడా వైకాపా ఎన్నికల్లో గెలిచి వస్తే.. అప్పుడు వారికి నచ్చిన చోట రాజధాని కట్టుకోవచ్చునట. ప్రతిపాదన బాగానే ఉంది గానీ.. జగన్ కు నచ్చిన పనిచేయడానికే.. ఆయన మంచిది అనుకున్నది అమల్లో పెట్టడానికే ప్రజలు ఆయనకు అధికారం అప్పజెప్పారు. నిండా ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే ప్రభుత్వాన్ని రద్దు చేస్తే.. ప్రజల తీర్పును జగన్ అవమానించినట్లు అవుతుంది కదా… అనేది ఒక సందేహం.
మరో కీలక అంశాన్ని గుర్తించాల్సి ఉంది. ఇప్పుడే అధికారంలోకి వచ్చిన వారు.. అంతలోనే అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడతారని అనుకోవడం భ్రమ. కానీ.. చంద్రబాబు వద్ద ఒక మహదవకాశం ఉంది.
చంద్రబాబునాయుడుకే గనుక దమ్ముంటే తమ పార్టీ వారందరితోనూ రాజీనామాలు చేయించి.. ఉప ఎన్నికలకు వెళ్లవచ్చు. వైకాపాకు ఇష్టం ఉన్నా లేకపోయినా.. ఆ స్థానాల్లో ఎన్నికలకు దిగాల్సి వస్తుంది. అవన్నీ బలమైన తెలుగుదేశం సీట్లు అని భావించి.. వారు వెనుకంజ వేస్తే గనుక.. తమ పాలనపై ప్రజాతీర్పు కోరడానికి వారు భయపడిపోతున్నారని నిరూపించవచ్చు. వారు పోటీకి దిగితే, ఓడించి.. వారి పాలనను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని నిందలు వేయవచ్చు.
తెదేపాకు ప్రస్తుతం 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాటిలో ఒక్కసీటును వైకాపాకు కోల్పోయినా.. జగన్ పాలనకు బ్రహ్మరథం పడుతున్నట్లుగా చంద్రబాబు ఒప్పుకోవాలి. ఈ కండిషన్‌కు లోబడి చంద్రబాబు అడుగులు వేస్తే బాగుంటుంది. దమ్ము నిరూపించుకోవడానికి జగన్ వెనకాడవచ్చు గాక, కానీ.. తన దమ్ము చూపుతూ ప్రజాతీర్పు కోరితే చంద్రబాబును శెభాష్ అనొచ్చు.