చంద్రబాబునాయుడు తనకు ప్రజలు అందించిన ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకుని.. ఇప్పుడు రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. జోలె పడుతున్నారు. బిచ్చమెత్తుతున్నారు. ఈ నాటకాలన్నీ ఎవరిని రక్తికట్టించడానికో తెలియదు. ఎందుకు చేశారో కూడా తెలియదు. జోలెపట్టి సేకరించిన డబ్బులను ఏం చేస్తారో కూడా తెలియదు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి ప్రభుత్వానికి అందజేస్తారా? లేదా, అమరావతిలో రాజధానికోసం పోరాడుతున్న ఉద్యమానికి మద్దతుగా ఆ డబ్బు ఖర్చు పెడతారా? ఇదంతా వేరే సంగతి.
అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన అంశం మరొకటి ఉంది. ఇదే ప్రయత్నం, పరిశ్రమ చంద్రబాబు ఆనాడు చేసిఉంటే.. ఇప్పుడు ఇలాంటి అవసరమే వచ్చేది కాదు. చంద్రబాబు తన అయిదేళ్ల పాలన కాలాన్ని దుర్వినియోగం చేశారు. రాజధాని అమరావతిలో వస్తుందని ప్రకటన చేసిన తర్వాత… అక్కడ రాజధాని నిర్మాణాలు చేపట్టడానికి ఎలాంటి క్రియాశీల ప్రయత్నమూ చేయకుండా ఆయన డ్రామాలు నడిపించారు. కేవలం డిజైన్లతో ప్రజలను మభ్యపెడుతూ గిమ్మిక్కులు చేశారు. ఆయన హయాంలో అమరావతి ప్రాంతంలో.. నిర్దిష్టంగా కోర్ కేపిటల్ కు సంబంధించిన ఏ కొన్ని నిర్మాణాలు పూర్తిచేసి ఉన్నప్పటికీ.. ఇవాళ ఇలా.. రాజధాని తరలింపు అనే ప్రస్తావనే తెరమీదకు వచ్చేది కాదు.
ఇవాళ బందరు వీధుల్లో జోలెపట్టి నిధులు సేకరిస్తూ… తన జీవితంలో తొలిసారి జోలెపట్టానని అక్కడికేదో బ్రహ్మాండం బద్ధలు చేసేసినట్లుగా సెలవిస్తున్న చంద్రబాబునాయుడు… ఇదే పని ఆనాడే చేసిఉంటే గనుక.. ఎంత గొప్పగా ఉండేది. తాను తలపెట్టిన ప్రాంతంలో రాజధాని నిర్మించడానికి నిధులు లేవని తెలుసు. కేంద్రం అవసరమైన మొత్తమూ ఇవ్వదని కూడా తెలుసు. అలాంటి నేపథ్యంలో.. నిధుల సమీకరణకు ఏదో పిలుపు ఇచ్చి ఊరుకోవడం కాకుండా.. ఈ జోలెపట్టడం ఆనాడే చేసి ఉండొచ్చు. తన ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లోనూ ఆ పనిచేయించి ఉండొచ్చు. వచ్చిన సొమ్ముతో కనీసం కొన్ని నిర్మాణాలను పూర్తి చేసి ఉండొచ్చు. వాటికి ప్రజానిర్మాణాలుగా పేరు పెట్టి ఉండొచ్చు.
పండే భూములను బీళ్లుగా మార్చడం తప్ప.. అలాంటి క్రియాశీలమైన ఏ పనీచేయకుండా ఇవాళ రాజధాని ఇక్కడే ఉండాలని డిమాండ్ చేసే హక్కు చంద్రబాబుకు ఎలా ఉంటుంది. ఆయన ఏ రాజధానిని ఇక్కడ నెలకొల్పారని, అది ఇక్కడే ఉండడానికి ఆయన డిమాండ్ చేస్తున్నారు? ఎంత అసంబద్ధంగా మాట్లాడుతూ.. అందుకు ఎన్ని కొత్త డ్రామాలు ఆడుతున్నారు.. అని ప్రజలు తలపోస్తున్నారు.