తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఒకప్పుడు జాతీయ స్థాయి నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, ఆయన కేవలం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కే పరిమితయ్యారు. అది 2019కి ముందు వ్యవహారం. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. చంద్రబాబు ఇప్పుడు మరీ దారుణంగా రెండు జిల్లాలకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి. వైఎస్ జగన్ సర్కార్, మూడు రాజధానుల ప్రతిపాదన ఏమవుతుందనేది వేరే చర్చ. కానీ, ఈ కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని నిలువునా ముంచేసింది.
అమరావతి పరిరక్షణ సమితి పేరుతో చంద్రబాబు హల్‌చల్ చేస్తున్న విషయం విదితమే. నిన్న విజయవాడ కేంద్రంగా చంద్రబాబు అండ్ కో హై డ్రామా నడిపింది. మరోపక్క, చంద్రబాబు అరెస్ట్‌కి నిరసనగా (అరెస్ట్ చేయలేదని పోలీసు శాఖ చెబుతోంది) ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు హల్‌చల్ చేశారు. అయితే, పది మంది పాతిక మంది కంటే ఎక్కువగా టీడీపీ శ్రేణులు ఎక్కడా కన్పించకపోవడం గమనార్హం.
క్రమక్రమంగా చంద్రబాబు తన స్థాయిని తానే తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇదే దూకుడుని చంద్రబాబు ఇక ముందూ కొనసాగిస్తే, సొంత జిల్లా చిత్తూరుని కూడా వదిలేసి ఆయన కృష్ణా – గుంటూరు జిల్లాలకే పరిమితం కావాల్సి వస్తుంది. రాయలసీమ వాసిగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా నారా చంద్రబాబునాయుడు తన వాయిస్‌ని ప్రతిపక్ష నేత హోదాలో బలంగా విన్పించాల్సి వుంది. కానీ, ఆయన మాత్రం, అమరావతికే పరిమితమవుతుండడం గమనార్హం.
రాయలసీమలో హైకోర్టుని స్వాగతించాలి.. అక్కడి అభివృద్ధి కోసం మాట్లాడాలి. ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోట. ఆ ప్రాంతంలో రాజధాని వస్తున్నందున హర్షించాలి.. అదే సమయంలో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వెనుకబాటుతనం గురించి ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రకాశం జిల్లా గురించి మాట్లాడొచ్చు. నెల్లూరు జిల్లా గురించీ నినదించొచ్చు. కానీ, ఇవేవీ చంద్రబాబుకి చేతకావడంలేదు.
ఒక్కమాటలో చెప్పాలంటే, చంద్రబాబు జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి.. రాష్ట్ర స్థాయి నుంచి ప్రాంత స్థాయికి.. ప్రాంత స్థాయి నుంచి జిల్లాలు.. ఇలా ఇప్పుడు కేవలం 29 గ్రామాల స్థాయికి తన ఇమేజ్‌ని తానే దిగజార్చేసుకోవడం ఆశ్చర్యకరం.