ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై బీజేపీ స్పష్టమైన అభిప్రాయంతో ఉంది. కిషన్ రెడ్డి అయినా, జీవీఎల్ అయినా, మురళీధరరావు అయినా.. మూడు రాజధానులకు తాము ఓకే అంటున్నారే కానీ, అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని ఎక్కడా చెప్పలేదు. అధికార వికేంద్రీకరణకు అనుకూలం, అదే సమయంలో అమరావతి రైతులు నష్టపోకుండా చూడండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంటే జగన్ నిర్ణయాన్ని బీజేపీ అధిష్టానం సమర్థిస్తోన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.
సీఎం జగన్ కూడా అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కేంద్రానికి సమాచారమిచ్చే అసెంబ్లీలో ప్రకటన చేశారని తెలుస్తోంది. అంటే కేంద్రం వద్ద రాజధాని మార్పుపై సమగ్రమైన సమాచారం ఉందన్నమాట, ముందుగానే సమాచారమిచ్చి వారి ఇగో కూడా శాటిస్ఫై చేశారు కాబట్టి.. ఇప్పటివరకూ కేంద్రం నుంచి వ్యతిరేకంగా ఎవరూ గొంతు విప్పలేదు.
బీజేపీ తరపున అధికారికంగా మాట్లాడే స్థాయి ఉన్న వారంతా అధికార వికేంద్రీకరణకు మేం సమ్మతమేనని చెబుతున్నారు. ఇక కన్నా, సుజనా వంటి కొంతమంది మాత్రమే అమరావతే రాజధానిగా ఉండాలంటూ హడావిడి చేస్తున్నారు. సుజనా చౌదరికి భూములున్నాయి కాబట్టి, అది వ్యాపారం కోసం పోరాటం అనుకోవాలి. ఇక సుజనాతో లావాదేవీలుండటం వల్ల కన్నా కూడా ఆయనకి వంతపాడుతున్నారు. రైతుపోరాటం పేరుతో జరుగుతున్న నకిలీ ఉద్యమానికి వీరు మద్దతిస్తున్నారు. సుజనా చౌదరి ఈ ఉద్యమానికి ఆర్థిక సాయం చేస్తున్నట్టు కూడా వినికిడి. మొత్తమ్మీద వీరిద్దరు మినహా బీజేపీ నేతలెవరూ అమరావతి విషయంలో గుడ్డిగా వాదించడంలేదు.
కేంద్రం అయితే పక్కాగా సపోర్ట్ చేస్తోంది. టీడీపీ చేసిన వేలకోట్ల అవినీతి బైటపడుతుంటే, బీజేపీ ఎందుకు వద్దంటుంది. ఆ అవినీతి చిట్టా బైటకు రావాలనే కమలదళం కోరుకుంటోంది, పైగా నూతన రాజధానికి చేయాల్సిన ఆర్థిక సాయం కూడా తగ్గే అవకాశం ఉండటంతో బీజేపీ ఏపీ మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తోంది.