‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని గురువారం సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభానికి చిత్తూరుకు వచ్చిన సీఎం వెంట రోజా పర్యటన ఆసాంతం ఉన్నారు. సభా వేదికపై జగన్, రోజా మధ్య మాటామంతీ అందరినీ ఆకర్షించింది. సభా వేదికపై సీఎం పక్క సీట్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూర్చున్నారు. ప్రసంగించడానికి వెళ్లిన సమయంలో ఆ సీట్లో రోజా వచ్చి కూర్చున్నారు.
జగన్‌తో సీరియస్‌గా రోజా చర్చించడం వైపే మీడియాతో పాటు అక్కడికి వచ్చిన ప్రజల దృష్టిని నిలిపింది. జగన్ చెవిలో రోజా సీరియస్‌గా గుసగుసలాడడం కనిపించింది. జగన్‌కు ఏదో చెప్పే సందర్భంలో రోజా హావభావాల్లో ఆవేశం కనిపించింది. అదే సమయంలో జగన్ తన ఎదుట ఉన్న నీళ్ల గ్లాస్‌ను రోజా వైపు తోస్తూ తాగమన్నట్టు సూచించాడు. రోజా ఆవేశాన్ని తగ్గించి చల్లబరిచేందుకే నీళ్లు ఇచ్చినట్టు పలువురు అభిప్రాయపడ్డారు.
అలాగే చివరిలో రోజా తలను నిమురుతూ తన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయనే భరోసా ఇచ్చినట్టు అర్థమవుతోంది. అసలు జగన్‌తో ఏ విషయమై సీరియస్‌గా చర్చించి ఉంటుందనే చర్చ మీడియా ప్రతినిధులు, వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య సాగింది. ఈ నెల 5న నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు మండలం కేబీఆర్ పురం దళితవాడలో గ్రామ సచివాలయ భూమి పూజకు వెళ్లిన రోజాను వైసీపీ అసమ్మతి వర్గీయులు అడ్డుకున్నారు.
ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన తమను కాదని టీడీపీ నుంచి వచ్చిన వారి మాటలు విని మరో స్థానంలో గ్రామ సచివాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడానికి వెళ్లిన రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై రోజాకు వివరణ లేదా ఫిర్యాదు చేసి ఉంటారని అందరూ భావిస్తున్నారు. కానీ జగన్ మాత్రం తన పర్యటనలో రోజాకు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించింది.