సాధారణంగా ఏ రీమేక్ సినిమాకైనా ప్రధానమైన ఇబ్బంది ఒకే ఒక్కటి. ఒరిజినల్ సినిమాలోని ఫీల్-ఎమోషన్ ను రీమేక్ లో చూపించలేకపోవడం. ఆ ఫీల్ క్యారీ అవ్వనప్పుడు రీమేక్ ఆటోమేటిగ్గా ఫెయిల్ అవుతుంది. కొన్ని రీమేక్స్ సక్సెస్ అవ్వడానికి, చాలా రీమేక్స్ ఫెయిల్ అవ్వడానికి ఇదే కారణం. అయితే ఈ విషయంలో జాను మాత్రం మొదటి అడ్డంకిని అధిగమించేలా కనిపిస్తోంది.
96 సినిమా కోలీవుడ్ లో ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దాన్ని హిట్ అనేకంటే, చాలామంది హృదయాల్ని హత్తుకుందని చెప్పడం కరెక్ట్. అంతలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు తమిళ తంబీలు. అలాంటి ఎమోషనల్ మూవీని జాను పేరిట తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కోలీవుడ్ లో క్రియేట్ అయిన మేజిక్ ను టాలీవుడ్ లో కూడా రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి కిందట విడుదలైన చేసిన టీజర్ ఆ ఫీల్ అండ్ ఎమోషన్ ను పండించడంలో సక్సెస్ అయింది.
జానుగా సమంత, రాముగా శర్వానంద్ టీజర్ లో చాలా బాగా నటించారు. టీజర్ చూస్తుంటే '96' తరహాలోనే ఇక్కడ కూడా వీళ్లిద్దరి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యేలా ఉంది. ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ సేతుపతి, త్రిష జీవించారు. రీమేక్ కోసం కొన్ని మార్పులు చేశామని దిల్ రాజు చెప్పినప్పటికీ టీజర్ లో మాత్రం అలాంటి మార్పులు కనిపించలేదు. తమిళ వెర్షన్ చూసిన వాళ్లకు ఈ విషయం అర్థమౌతుంది.
మొత్తమ్మీద 96 రీమేక్ ను నిజాయితీగా తీస్తున్నట్టున్నారు. తమిళ సినిమా తీసిన దర్శకుడే తెలుగు వెర్షన్ కు కూడా వర్క్ చేస్తుండడంతో 96 ఫ్యాన్స్ ను జాను డిసప్పాయింట్ చేయదనే చెప్పాలి. ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.