టీడీపీ నేతల్లో ఒక్కసారిగా పౌరుషం పొంగింది. అధికారం మనదే అనే ఆత్మవిశ్వాసం పెరిగింది. దీంతో ఎన్నికలకు ఏడాది ముందుగానే వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు తొడలు కొడుతున్నారు, రాండి తేల్చుకుందాం అంటూ మీసాలు దువ్వుతున్నారు. ఇదంతా ఆ మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ సాధించిన విజయాలు తీసుకొచ్చిన మార్పుగా చెప్పొచ్చు. 2024 ఎన్నికలకు ఏడాది ముందు ఈ ఫలితాలు సహజంగానే టీడీపీకి ప్రాణం పోశాయి.
ఇదంతా వైసీపీ స్వీయం తప్పిదమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే పట్టభద్రుల స్థానాల్లో తమ పార్టీ ఓటమిపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ ….పట్టభద్రుల ఓటర్లలో తమ మద్దతుదారులు తక్కువగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన సామాన్య ఓటర్ల అభిప్రాయాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబించవని ఆయన చెప్పారు.
అంటే పట్టభద్రుల ఓటర్లు తమకు వ్యతిరేకమని తెలిసి కూడా బరిలో దిగారని అర్థం చేసుకోవాలా? ఓడిపోయి తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్ ఇవ్వాలనే పట్టుదలతో వైసీపీ ఉద్దేశ పూర్వకంగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిందని సజ్జల మాటల పరమార్థమని అర్థం చేసుకోవాలేమో? చివరికి ఈ ఎన్నికలు ఇచ్చిన ఆత్మవిశ్వాసం, భరోసాతో టీడీపీ కార్యకర్త స్థాయి మొదలుకుని నాయకుల వరకూ రెచ్చిపోయి వార్నింగ్లు ఇస్తున్నారు.
ఓడించామని, రానున్న ఎన్నికల్లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని, సవాల్ విసురుతూ తొడలు కొడుతున్నారు. ఢీ అంటే ఢీ అని తలపడడానికి ఎప్పుడైనా, ఎక్కడైనా రెడీ అంటూ టీడీపీ నేతల పరాక్రమాలు ఓ రేంజ్లో ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయాన్ని ఎలా విశ్లేషించాలో అర్థం కాక, వైసీపీ నేతలు సతమతమవుతున్నారు. ఈ వాడి, వేడి రానున్న రోజుల్లో మరింత పెరగనున్నాయి.