ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోని రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించడంపై జనసేనాని పవన్‌కల్యాణ్ నోరెత్తకపోవడం చర్చనీయాంశమైంది. తాను ద్వేషించే వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలపై పవన్ స్పందించకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
వైసీపీకి వ్యతిరేకంగా ఎలాంటి ఫలితం వచ్చినా వెంటనే తానున్నానంటూ పవన్‌కల్యాణ్ స్పందిస్తూ వుంటారు. అలాంటిది తన అనధికార మిత్రపక్షమైన టీడీపీకి అనుకూల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో, ఆ ఆనందాన్ని పవన్ పంచుకోకపోవడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది.
పట్టభద్ర ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని పవన్‌కల్యాణ్ కోరుకుంటున్నట్టు ఆ పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి తన విజ్ఞప్తిని గౌరవించి, మన్నించి వైసీపీని ఓడించారని, అందుకు కృతజ్ఞతలు చెప్పడంలాంటివి జరగలేదు.
టీడీపీ మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడం జనసేనకు పెద్దగా ఆనందం కలిగించడం లేదని టాక్. వైసీపీకి వ్యతిరేక ఫలితాలను పవన్‌కల్యాణ్ ఆస్వాదించలేకున్నారా? లేక టీడీపీతో అనధికార పొత్తును బహిరంగంగా బయటపెట్టుకోవడం ఇష్టం లేక మౌనాన్ని ఆశ్రయించారా? అనే చర్చ లేకపోలేదు.
అసలు ఈ ఫలితాలను జనసేన ఎలా చూస్తున్నదో తెలుసుకోవాలనే ఆసక్తి కొందరిలో వుంది. మరోవైపు టీడీపీ మాత్రం జనసేన సహకరించడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలలేదని, అందువల్ల విజయం సాధ్యమైందని పవన్‌కు బిస్కెట్లు వేసే పనిలో పడింది. రానున్న ఎన్నికల్లో పవన్ మద్దతు కోసమో ఇదంతా చేస్తుందన్నది జగమెరిగిన సత్యం.