పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలుపొందడంతో టీడీపీలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అక్కడి నుంచి గెలుపొందిన టీడీపీ నాయకుడు భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి పులివెందుల పులి బిడ్డ అంటూ ఎల్లో మీడియా ఆకాశమే హద్దుగా పొగడ్తలతో ముంచెత్తుతోంది. రానున్న ఎన్నికల్లో పులివెందులలో కూడా గెలుస్తామని టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఒకేసారి మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపొందడంతో టీడీపీలో ఆ మాత్రం జోష్ ఉండడం ఆశ్చర్యం లేదు. దప్పికతో అల్లాడుతున్న మనిషికి కావాల్సినన్ని నీళ్లు దొరికితే… ఎంత ఆనందం కలుగుతుందో, ఇప్పుడు టీడీపీ పరిస్థితి కూడా అట్లే వుంది.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల కూడా ఉండడమే టీడీపీ రెట్టించిన ఆనందానికి ప్రధాన కారణం. వైఎస్ జగన్ కంచుకోటను బద్ధలు కొట్టామంటూ టీడీపీ విరవీగుతోంది. అయితే ఇదే సూత్రం చంద్రబాబునాయుడికి వర్తించదా? అనేది ఇప్పుడు ప్రశ్న. చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ ఓడిపోతే, అసలు అదేం పెద్ద సమస్య కానట్టు, అసలు ఆ జిల్లాకు టీడీపీ అధినేతకు ఏ మాత్రం సంబంధం లేనట్టు ఇదే ఎల్లో మీడియా ప్రతి సందర్భంలోనూ వ్యవహరిస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సొంత జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో కేవలం కుప్పంలో ఆయన మాత్రమే గెలుపొందారు. అలాగే తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ గాలికి కొట్టుకుపోయింది. అంతకంటే ముందు, 2017లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై పీడీఎఫ్ అభ్యర్థి యండవల్లి శ్రీనివాసులురెడ్డి గెలుపొందారు. నాటి మంత్రి కె.నారాయణకు స్వయాన పట్టాభి బామ్మర్ది. నారాయణ తన సొంత విద్యాసంస్థల్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు.
అయినప్పటికీ వైసీపీ మద్దతుతో యండవల్లి గెలుపొందారు. అప్పుడెవరూ చంద్రబాబుకు షాక్ అని, నాటి సీఎం సొంత ప్రాంతంలో టీడీపీకి ఎదురుగాలి అని మాట్లాడలేదు. బాబు కంచుకోట బద్ధలైందని అనలేదు. బాబు అడ్డాలో పీడీఎఫ్ అభ్యర్థి రెండోసారి గెలుపొందారని చర్చించుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడూ సొంత ప్రాంతంపై అభిమానం చూపలేదు. అందుకు తగ్గట్టే ఆయన్ను జనం ఆదరించలేదు. ఇదే వైఎస్ కుటుంబ విషయానికి వస్తే ఆ ప్రాంతం తమ వారిగా చూస్తోంది. అందుకే మండలి ఎన్నికల్లో ఓటమితో వైఎస్ జగన్ పని అయిపోయినట్టు రంకెలేస్తున్నారు.