పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ బలపరిచిన ఆ పార్టీ నాయకుడు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఇది ఆ పార్టీకి భారీ ఊరటే. వైసీపీకి అడ్డాగా పేరుండడంతో పాటు సీఎం వైఎస్ జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కడప జిల్లా కావడం ఇందులోకి వస్తుండడంతో ఈ విజయానికి విపరీత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే టీడీపీ విజయంతో ఏదో అయిపోయిందని అనుకుంటే ఆ పార్టీ నేతలు తమను మోసం చేసుకున్నట్టే.
గతంలో వైఎస్సార్ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇట్లే జరిగింది. 2006లో జరిగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడైన అప్పటి ఆ పార్టీ నాయకుడు ఎంవీ శివారెడ్డి గెలుపొందారు. నాడు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని బరిలో నిలపలేదు. కానీ కమ్యూనిస్టు నేపథ్యం కలిగిన ప్రముఖ న్యాయవాది వీణా అజయ్‌కుమార్‌కు కాంగ్రెస్‌లో ఎక్కువ మంది మద్దతు పలికారు.
అయితే సామాజిక సమీకరణలు, బంధుత్వం రీత్యా నాటి అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా రాజకీయాలను పక్కన పెట్టి ఎంవీ శివారెడ్డికి మద్దతు ఇచ్చారు. దీంతో ఎంవీ శివారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ నేతృత్వంలో రెండో దఫా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఇదే పట్టభద్రుల నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అధికారంలో ఉన్న పార్టీకి భిన్నమైన ఫలితం రావడం కొత్త, వింతేమీ కాదని చెప్పడానికే ఈ ఉదాహరణ. కాదు, కూడదని టీడీపీ అనుకుంటూ, అధికారంలోకి వచ్చినట్టుగా ఫీల్ అయితే అది వారిష్టం.