అనుకూల మీడియా స‌ర్వేల్లోనే ఇలా అయితే!

భార‌తీయ జ‌న‌తా పార్టీ యూపీలో 230 నుంచి 249 వ‌ర‌కూ సాధించ‌వ‌చ్చ‌ని తాజాగా ఒక స‌ర్వే వెల్ల‌డించింది. ఇది పూర్తిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ అనుకూల మీడియా సంస్థ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌ర్వే. జాతీయ…

భార‌తీయ జ‌న‌తా పార్టీ యూపీలో 230 నుంచి 249 వ‌ర‌కూ సాధించ‌వ‌చ్చ‌ని తాజాగా ఒక స‌ర్వే వెల్ల‌డించింది. ఇది పూర్తిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ అనుకూల మీడియా సంస్థ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌ర్వే. జాతీయ స్థాయిలో  బీజేపీ త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకుని అనునిత్యం వాదిస్తూ ఉండే మీడియా సంస్థ అది. 

ఇక్క‌డ ధ‌ర్మ సందేహం ఏమిటంటే.. బీజేపీ త‌ర‌ఫున లాయ‌ర్ల‌లా వాదించే జ‌ర్న‌లిస్టులున్న న‌వ‌భార‌త స‌మ‌య మీడియా సంస్థ స‌ర్వేలోనే బీజేపీకి 230 సీట్లు అంటే.. అస‌లు క‌థ ఎలా ఉండ‌బోతోంద‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది.

యూపీ ఎన్నిక‌ల‌పై స‌ర్వేల ప‌రంప‌ర కొన‌సాగుతూ ఉంది. గ‌త ట‌ర్మ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యూపీలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన బీజేపీ.. ఈ సారి అలాంటి ఫీట్ ను రిపీట్ చేయ‌లేద‌ని ఈ స‌ర్వేల‌న్నీ ఘంటాప‌థంగా చెబుతూ ఉన్నాయి. ఆఖ‌రికి క‌మ‌లం పార్టీ ఆస్థాన మీడియా కూడా ఇదే మాటే చెబుతూ ఉంది.

బీజేపీకి 230 సీట్ల‌కు మించి రావొచ్చ‌ని తాజాగా క‌మ‌లం అనుకూల మీడియా అంచ‌నా వేసిన నేప‌థ్యంలో.. ఇంత‌కీ యూపీలో ఏం జ‌రుగుతోంద‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. యూపీలో స‌మాజ్ వాదీ పార్టీ బాగా పుంజుకోవ‌చ్చ‌ని ఈ స‌ర్వేలు చెబుతున్నాయి. తాజా అధ్య‌య‌నం ప్ర‌కారం కూడా.. యూపీలో ఎస్పీ గ‌రిష్టంగా నూటా యాభై సీట్ల వ‌ర‌కూ సాధించ‌వ‌చ్చ‌ట‌! 

బీఎస్పీకి తొమ్మిది నుంచి ప‌ద్నాలుగు సీట్లు, కాంగ్రెస్ పార్టీకి నాలుగు నుంచి ఆరు సీట్లు రావొచ్చ‌ని ఈ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది. ఓట్ల శాతం విష‌యానికి వ‌స్తే బీజేపీకి 38.6 శాతం ఓట్లు రావొచ్చ‌ట‌. అదే ఎస్పీకి 34.4 శాతం ఓట్లు ద‌క్క‌వ‌చ్చ‌ని ఈ అంచ‌నా చెబుతూ ఉంది. నాలుగు శాతం ఓట్ల తేడాతో బీజేపీ అద‌నంగా వంద సీట్ల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఈ స‌ర్వే చెబుతూ ఉంది. బీజేపీ గెలుస్తుంద‌నే అంటున్నా.. ఆస్థాన మీడియానే, బీజేపీ ప్ర‌భంజ‌నం మునుప‌టిలా లేద‌ని చెబుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం.