ఇద్దరు కొట్టుకుంటే నేను పంచాయితీ పెట్టను – చిరంజీవి

దాసరి తర్వాత ఇండస్ట్రీలో పెద్దరికం లేకుండా పోయిందనేది బహిరంగ రహస్యం. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చిరంజీవి చాలా ప్రయత్నించారనేది కూడా అంతే బహిరంగ రహస్యం. అయితే పరిశ్రమకు సంబంధించి కొన్ని సమస్యల్ని పరిష్కరించే…

దాసరి తర్వాత ఇండస్ట్రీలో పెద్దరికం లేకుండా పోయిందనేది బహిరంగ రహస్యం. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చిరంజీవి చాలా ప్రయత్నించారనేది కూడా అంతే బహిరంగ రహస్యం. అయితే పరిశ్రమకు సంబంధించి కొన్ని సమస్యల్ని పరిష్కరించే క్రమంలో చిరంజీవి చొరవను కొంతమంది అంగీకరించలేదు. ఇండస్ట్రీకి పెద్ద అంటూ ఎవ్వరూ లేరని మరికొందరు హీరోలు స్టేట్ మెంట్లు ఇవ్వడం కూడా చిరంజీవిని బాధించింది.

ఇన్నాళ్లూ ముసుగులో గుద్దులాటలా నలుగుతున్న ఈ అంశంపై చిరంజీవి ఓపెన్ గా స్పందించారు. తనకు పరిశ్రమ పెద్ద అనిపించుకోవడం ఏమాత్రం ఇష్టంలేదని స్పష్టంచేశారు చిరంజీవి. ఇకపై తనను పరిశ్రమ పెద్దగా ఎవ్వరూ చూడొద్దని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు.

“పెద్దరికం అనిపించుకోవడం, ఓ హోదా చూపించుకోవడం నాకు ససేమిరా ఇష్టం లేదు. నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండను. కానీ బాధ్యత గల ఓ సినీ పరిశ్రమ బిడ్డగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు నేనున్నానంటూ ముందుకొస్తాను. కానీ ప్రతి విషయంలో తగుదునమ్మా అనుకుంటూ ముందుకొచ్చే ప్రసక్తే లేదు. ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను. ఆ పదవి నాకొద్దు. కానీ ఏదైనా అవసరంలో, సంక్షోభంలో, ఏదైనా విషయంలో భుజం కాయాలన్నప్పుడు ఎప్పుడూ బాధ్యత తీసుకోవడానికి రెడీ.”

ఇదే సందర్భంలో తను ఎక్కడ బాధ్యతగా వ్యవహరిస్తాననే విషయంపై కూడా చిరంజీవి స్పందించారు. ఇండస్ట్రీ సమస్యను సమగ్రంగా చూసి బాధ్యత తీసుకుంటానని.. ఓ సెక్షన్ కు పరిమితమైన సమస్యల్ని భుజానికెత్తుకోనని విస్పష్టంగా ప్రకటించారు.

“ఎవ్వరో ఇద్దరు కొట్టుకొని పంచాయితీ పెడితే, అలాంటి తగవులు నేను తీర్చలేను. పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని లేదా ఆరోగ్యం-ఉపాధి సమస్యల విషయంలో నేను ముందుంటాను. అంతేతప్ప, 2 యూనియన్లు, ఇద్దరు వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొని నన్ను పంచాయితీ చేయమంటే మాత్రం చేయను. అలాంటి పెద్దరికం నాకొద్దు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నాకు పెద్ద ఇబ్బంది.”

ఇలా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరనే అంశంపై సూటిగా స్పందించారు చిరంజీవి. ఇకపై సమస్య ఏదైనా తను బాధ్యతగా ముందుకొస్తాను తప్ప, తనకు పెద్దరికం మాత్రం ఆపాదించొద్దని చెబుతున్నారు. ఆమధ్య తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినప్పుడు పలు విమర్శలు ఎదుర్కొన్నారు చిరంజీవి. తాజాగా ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంపై ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్య జరుగుతున్న వివాదాలను దృష్టిలో పెట్టుకొని తన పెద్దరికంపై చిరంజీవి ఇలా క్లారిటీ ఇచ్చినట్టయింది.