క‌నుచూపు మేర‌లో క‌రోనా ఆంక్ష‌లు!

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోంది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ మొద‌ట చైనాలో మొద‌లై, ఆ త‌ర్వాత ప్ర‌పంచాన్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పంజా విసురుతోంది.…

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోంది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ మొద‌ట చైనాలో మొద‌లై, ఆ త‌ర్వాత ప్ర‌పంచాన్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పంజా విసురుతోంది. దీంతో మ‌రోసారి ప్ర‌పంచ‌మంతా వ‌ణికిపోతోంది. ఒమిక్రాన్ వ్యాప్తి ఉధృతంగా సాగుతోంది. దీని ప్ర‌భావం గురించి ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌డం లేదు. క‌రోనా సెకెండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండ‌ద‌ని కొంద‌రు చెబుతుంటే, మూడింత‌ల ప్ర‌భావం ఉంటుంద‌ని మ‌రికొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు హ‌ర్యానా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ మేర‌కు ఆ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో నిషేధాజ్ఞ‌లను ఇవాళ నుంచి అమ‌లు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. దేశ రాజ‌ధానికి స‌మీపంలో హ‌ర్యానా ఉండ‌డంతో ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఒమిక్రాన్ కేసుల న‌మోదు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో గురుగ్రామ్‌, ఫ‌రీదాబాద్‌, అంబాలా, పంచ‌కుల‌, సోనిప‌ట్ జిల్లాల్లో ఆదివారం నుంచి ప‌ది రోజుల పాటు క‌ఠిన ఆంక్ష‌లు అమ‌ల్లోకి రానున్నాయి. ఈ జిల్లాల్లో సినిమా థియేట‌ర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఈత‌కొల‌నుల‌ను మూసి వేయ‌నున్నారు.  వీటితో పాటు మార్కెట్లు, మాల్స్‌ను సాయంత్రం 5 గంట‌ల‌కే మూసి వేయాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

అలాగే బార్లు, రెస్టారెంట్ల‌ను 50 శాతంతో న‌డుపుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం సూచించింది. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ కార్యాల‌యాల్లో స‌గం మందితో కార్య‌క‌లాపాలు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ ప‌రిణామాలు తెలుగు స‌మాజాన్ని ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ‌లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

తెలంగాణ‌తో ఆంధ్రాలో కేసుల సంఖ్య త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, ఇలాగే వుంటుంద‌నే న‌మ్మ‌కం లేదు. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు కుదుట ప‌డ‌తాయ‌ని అనుకుంటున్న త‌రుణంలో థ‌ర్డ్ వేవ్ రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇది ఈ స్థాయిలో న‌ష్టం క‌లిగిస్తుందోన‌నే ఆందోళ‌న తెలుగు స‌మాజాన్ని ప‌ట్టి పీడిస్తోంది.