నెల్లూరు పెద్దారెడ్డితో పెట్టుకుంటే ఏమవుతుందో సినిమాల్లో చూశాం. కానీ చిత్తూరు పెద్దారెడ్డితో పెట్టుకుంటే ఏమవుతుందో రియల్ లైఫ్లో చూడొచ్చు. తమతో వైరం అనే మాటను కలలో కూడా ఊహించడానికి భయపడేలా చిత్తూరు పెద్దారెడ్డి శిక్షను అమలు చేశారు. పాత కేసును తవ్వి, యుద్ధప్రాతిపదికన విచారణ, అనంతరం అరెస్ట్ చేసి తీవ్రమైన కేసులో నిందితులను హాజరు పరిచిన వైనాన్ని కళ్లకు కట్టారు.
చివరికి వైసీపీ శ్రేణులే భయపడేలా చిత్తూరు పెద్దారెడ్డి శాసిస్తుండడం గమనార్హం. సొంత పార్టీకి చెందిన జెడ్పీటీసీ భర్త అని కూడా చూడకుండా, తమపై విమర్శలు చేయడంతో కటకటాలపాలు చేయడం చిత్తూరు జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నుంచి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వయాన సోదరుడు.
ఈయనపై తంబళ్లపల్లె జెడ్పీటీసీ సభ్యురాలు గీతారెడ్డి భర్త మద్దిరెడ్డి కొండ్రెడ్డి రెండు రోజుల క్రితం తీవ్ర విమర్శలు చేశారు. ఈయన కూడా వైసీపీ కావడం గమనార్హం. తమపై జెడ్పీటీసీ సభ్యురాలు భర్త ఎదురు తిరగడాన్ని పెద్దిరెడ్డి కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. కొండ్రెడ్డిని ఊరికే విడిచిపెడితే, భవిష్యత్లో మరొకరు ఇలాగే తిరుగుబాటు చేస్తారని పెద్దిరెడ్డి కుటుంబం భావించింది.
దీంతో 2008లో కొండ్రెడ్డిపై నమోదైన నకిలీ పట్టాల పంపిణీ కేసును పోలీసులు, రెవెన్యూ అధికారులతో వెలికి తీయించారు. ఏడుగురి నుంచి డబ్బు తీసుకుని నాటి ఇన్చార్జి తహశీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేశాడనే ఫిర్యాదుపై రెవెన్యూ అధికారులు విచారించారని, నిజమని తేలిందని సీఐ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కొండ్రెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ కేసు పెట్టి, అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
కొండ్రెడ్డి ముఖానికి ముసుగు తొడిగి విలేకరుల ముందు హాజరుపరచడం ఈ కేసులో ప్రత్యేకత. హంతకులు, దొంగలు, అత్యాచార కేసుల్లో నిందితులను హాజరు పరిచిన వైనాన్ని కొండ్రెడ్డి అరెస్ట్ మరిపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే అతని నేరమైందని వైసీపీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.