నిన్న మొన్నటి వరకూ ఉదయాన్నే పేపర్ చూస్తే.. హెడ్ లైన్స్ అమరావతి గురించే ఉండేవి. ఉద్యమాన్ని హైలెట్ చేసుకుంటూ టీడీపీ అనుకూల మీడియా.. ఉద్యమం లేదంటూ, అమరావతిపై వైసీపీ నేతలు చేస్తున్నహాట్ కామెంట్స్ ని హైలెట్ చేస్తూ.. టీడీపీ వ్యతిరేక మీడియా వార్తలు ఇస్తూ ఉండేవి. ఒక్కసారిగా సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ ఉత్తరాంధ్రగా మారిపోయింది.
సబ్బంహరి ఆక్రమణలు పడగొట్టడంతో మొదలుపెడితే.. గీతం యూనివర్సిటీ అడ్డగోలు వ్యవహారాల వరకు రాజకీయ చర్చలకు విశాఖ కేంద్రబిందువుగా మారుతోంది. విశాఖలో నాలుగు దిక్కులూ తమవేనంటూ విర్రవీగిన టీడీపీ క్రమక్రమంగా ఒక్కో దిక్కుని కోల్పోతోంది. మొత్తమ్మీద నాయకులు విశాఖ వెళ్లకపోయినా.. రాజకీయం మాత్రం విశాఖ కేంద్రంగా సాగుతోంది.
అసెంబ్లీలో సీఎం జగన్ మూడు రాజధానులపై చేసిన ప్రకటన తర్వాత కూడా విశాఖకు అనుకున్నంత ప్రచారం రాలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోకపోవడంతో విశాఖకు ప్రమోషన్ లభించలేదు. ఇంకా అమరావతే రాజధాని అని ప్రజల్ని మభ్యపెట్టేందుకు మీడియా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే సీఎం జగన్ రూటు మార్చారు. అసలు సిసలు రాజకీయం విశాఖ నుంచే మొదలు పెట్టారు.
కూల్చివేతలతో ఏం జరుగుతుంది, సింపతీ పెరుగుతుంది తప్ప.. అని కొంతమంది వారిస్తున్నా.. జగన్ మాత్రం రూల్స్ ప్రకారం వెళ్లాల్సిందేనంటూ అటు అధికారుల్ని, ఇటు పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించారు. అందుకే విశాఖలో ఒక్కొకరి కూసాలు కదులుతున్నాయి.
ఆక్రమణల పర్వానికి అడ్డుకట్ట వేస్తూ కూల్చివేతలు మొదలయ్యాయి. మొన్న సబ్బం హరి, నిన్న గీతమ్.. ఇలా విశాఖ మరోసారి వార్తల్లోకెక్కింది. రాబోయే రోజుల్లో విశాఖలో మరిన్ని ఆక్రమణలు తొలిగే అవకాశం ఉంది.
మొత్తమ్మీద విష వాయువు విషాదంతో వార్తల్లోకెక్కిన విశాఖ.. ఇప్పుడు రాజకీయ రచ్చలు, చర్చలతో మరింత వేడిగా మారింది. రాజధాని రాజకీయాలంటే ఆమాత్రం వేడి ఉండాల్సిందే. పార్టీ ఆఫీస్ లు, పార్టీ అధినేతలు.. లేకుండానే విశాఖ పొలిటికల్ క్యాపిటల్ గా మారుతోంది.