ఆనందయ్యకి సపోర్ట్ గా ఆయుర్వేదం వీర్రాజు

ఈమధ్య సారాయి వీర్రాజు, టమోటా వీర్రాజు, సిమెంట్ వీర్రాజుగా పాపులర్ అయిన.. బీజేపీ సోము వీర్రాజు.. త్వరలో ఆయుర్వేదం వీర్రాజుగా మారబోతున్నారు. అవును, ఆనందయ్యను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని, ఆయన మందు పంపిణీకి ప్రభుత్వమే…

ఈమధ్య సారాయి వీర్రాజు, టమోటా వీర్రాజు, సిమెంట్ వీర్రాజుగా పాపులర్ అయిన.. బీజేపీ సోము వీర్రాజు.. త్వరలో ఆయుర్వేదం వీర్రాజుగా మారబోతున్నారు. అవును, ఆనందయ్యను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని, ఆయన మందు పంపిణీకి ప్రభుత్వమే అడ్డు పడుతోందంటూ ఆయన ఆయుర్వేదానికి మద్దతుగా చిన్న పోరాటమే మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. 

ఆనందయ్య మందుకి అనుమతి లేదని ఆయుష్ అధికారులు చెప్పడం, స్థానిక అధికారులు మందు పంపిణీపై వివరణ కోరడం.. అన్నిటికీ మించి కృష్ణపట్నం గ్రామ పంచాయతీ ఆనందయ్యకి వ్యతిరేకంగా తీర్మానం చేయడంతో గొడవ పెద్దదైంది.

ఓవైపు ఆనందయ్య కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. మందు పంపిణీకి అనుమతి కావాలని కోరారు. ఈ విషయం అలా ఉండగానే.. దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది బీజేపీ. ఆనందయ్యకు సపోర్ట్ రావాలని ప్లాన్ గీసింది. గతంలో ఆనందయ్య వైసీపీ సానుభూతిపరుడు. ఆనందయ్యకు వైసీపీ నాయకులతో సత్సంబంధాలున్నాయి. కానీ ఈమధ్య అవి బెడిసికొట్టాయని తెలుస్తోంది.

అందులోనూ ఆనందయ్య తాను సొంతగా రాజకీయ పార్టీ పెడతానంటూ ప్రకటించారు. ఆయుర్వేద వైద్యుడికి రాజకీయాలపై మమకారం పుట్టగానే సహజంగా ఆయనపై ఉన్న సాఫ్ట్ కార్నర్ అందరికీ తొలగిపోయింది. ఇప్పుడు మందు పంపిణీ వ్యవహారంలో కూడా ఆనందయ్యపై వస్తున్న వ్యతిరేకతకు పరోక్ష కారణం కూడా అదే.

ఆనందయ్యను దువ్వుతున్న బీజేపీ..

ఇప్పటికే ఆనందయ్యకు బీజేపీ రాయబారం పంపింది. గతంలో టీడీపీలో ఉంటూ ఆనందయ్యకు దగ్గరగా ఉన్న ఓ నాయకుడిని ఆయన అభిప్రాయం తెలుసుకోడానికి పురమాయించారట. ఆనందయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. ముందు ఆయుర్వేదానికి మద్దతిస్తున్నట్టుగా కలరింగ్ ఇచ్చి, ఆ తర్వాత మెల్లగా తమవైపు తిప్పుకోవాలనేది కాషాయదండు ఆలోచన. అందుకే వీర్రాజు బరిలో దిగాలనుకుంటున్నారు.

నెల్లూరు వచ్చి ఆనందయ్యకు మద్దతుగా పోరాటం ప్రారంభించాలనుకుంటున్నారట సోము. చీప్ లిక్కర్ పాపాన్ని కడిగేసుకోడానికి రోజుకో ప్రెస్ మీట్ పెడుతూ రెచ్చిపోతున్న వీర్రాజుకి, ఈ అంశం కూడా కలిసొచ్చినట్టుంది. ఆనందయ్యకు మద్దతుగా ఆయుర్వేదం వీర్రాజు త్వరలోనే రంగంలోకి దిగబోతున్నారనమాట.