కొంత మంది వ్యక్తుల పనితీరుతో వారు ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యవస్థలపై గౌరవం, నమ్మకం పెరుగుతాయి. మరికొందరి చేష్టలతో ఆ వ్యవస్థలపై అసహనం, అపనమ్మకం ఏర్పడుతాయి. ఇందులో రెండో రకానికి చెందిన వ్యవహార శైలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ది.
జగన్ సర్కార్‌ను ఏ విధంగా అప్రతిష్టపాలు చేయాలనే తలంపు తప్ప …జనానికి పని కొచ్చేలా వ్యవహరిస్తామనే తీరు ఆయనలో మచ్చుకైనా కనిపించడం లేదు. ఎల్లో బ్యాచ్‌కు ఏ విధంగా బ్యానర్ న్యూస్ అందివ్వాలనే యావ తప్ప … తాను జనానికి న్యూసెన్స్‌గా తయారయ్యాననే స్పృహ ఆయనలో ఇసుమంతైనా కనిపించడం లేదు. చిన్న విషయాన్ని కూడా ఎంతగా న్యూసెన్స్ క్రియేట్ చేయవచ్చో నిమ్మగడ్డ దగ్గ ట్రైనింగ్ తీసుకోవచ్చు.
తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయా నికి వెళ్లిన ఓ వర్తమానాన్ని తీసుకుని …నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సృష్టించిన న్యూసెన్స్ ఆయన వ్యక్తిత్వం ఏంటో స్పష్టంగా కళ్లకు కట్టింది. ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయం నుంచి వెళ్లిన వర్తమానం ఏంటో చూద్దాం.
“త్వరలో జరగనున్న పార్లమెంటు ఉప ఎన్నికలు, శాసన మండలి ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 26న సీఎం క్యాంపు కార్యాలయం మొదటి అంతస్తులో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ఒక సమావేశం నిర్వహిస్తు న్నారు. దానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హాజరవ్వాలి” అని సదరు లేఖలోని సమాచార సారాంశం.
ఈ లేఖపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ లేఖ పంపిన ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్ ద్వారా నిమ్మగడ్డ ఘాటుగా సమాధానం పంపారు. ఆ సమాధానం కథేంటో చూద్దాం.
“మీరు పంపించిన వర్తమానాన్ని ఎన్నికల కమిషనర్ దృష్టిలో ఉంచాను. దానిపై ఆయన ఆదేశం మేరకు మీకు ఈ ప్రత్యుత్తరం పంపిస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్టు రాజ్యాంగబద్ధ పదవి. హైకోర్టు జడ్జితో సమాన హోదా గల పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్‌కి …ఒక సమావేశానికి హాజరవ్వాలని ఇలా హుకుం జారీ చేయడం తీవ్ర అభ్యంతరకరం, అసంబద్ధం. అది బెదిరింపు ధోరణిలా ఉంది.
మీ వైఖరి ఎన్నికల కమిషన్ స్వతంత్రతకు , సమగ్రతకు భంగం కలిగించడమే. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉంది. అలాంటి సమయంలో ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసేలా వ్యవహరించిన మీ తీరును హైకోర్టు దృష్టికి తీసుకెళతాం”
నిజంగా ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు తన సంస్థ స్వతంత్రత గురించి ఇప్పుడే తెలిసొచ్చిందా? మరి ఎప్పుడో రెండేళ్ల క్రితమే జరగాల్సిన స్థానిక సంస్థలను నిర్వహించడానికి స్వతంత్రంగా ఎందుకు వ్యవహరించలేకపోయారో సమాధానం చెబుతారా? అయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక వైపు బెదిరిస్తూ , మరోవైపు తనను బెదిరిస్తున్నారని పేర్కొనడం అంటే మొగున్ని కొట్టి మొగసాలకు ఎక్కిన చందంగా లేదా?
ఎన్నికల కమిషనర్ పోస్టు రాజ్యాంగబద్ధ పదవి, హైకోర్టు జడ్జితో సమానమైన హోదా గల పదవిలో ఉన్న కమిషనర్ని సమావేశానికి హాజరు కావాలని హుకుం జారీ చేయడం అని లేఖలో రాయడం బెదిరింపు కాక మరేంటి? రాజ్యాంగబద్ధమైన పదవి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థపై పెత్తనం చేయడానికి కాదనే విషయాన్ని నిమ్మగడ్డ విస్మరించొద్దు. అలాగే ఇంకో కీలక విషయం గురించి తప్పక మాట్లాడుకోవాలి.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు విచారణలో ఉండగా, ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసేలా వ్యవహరించిన మీ తీరును హైకోర్టు దృష్టికి తీసుకెళతామని ఎన్నికల కమిషనర్ హెచ్చరించడం గురించి తప్పక చర్చించాలి.
మరి ఇదే సూత్రం నిమ్మగడ్డకు వర్తించదా? విచారణలో ఉండగా ఈ నెల 28న రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఎలా నిర్వహిస్తారు? అంటే హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉన్న వ్యక్తి చట్టాలను అతిక్రమించవచ్చని రాజ్యాంగంలో రాశారా? ఏమిటీ విపరీత పోకడలు?
అయినా ప్రతిసారి రాజ్యాంగబద్ధమైన పదవి అంటూ చెప్పడం ద్వారా , ఇలాంటి వ్యక్తిని వెనుకేసుకొచ్చే రాజ్యాంగ వ్యవస్థను ఎందుకు గౌరవించాలనే ప్రశ్న ఉదయిస్తే …ఆ దుష్పరిణామాలకు కారకులెవరు? ఊరికే రాజ్యాంగ పదవని విర్రవీగడం కాదు …ఆ పదవికి వన్నె తెచ్చేలా వ్యవహరించాలి. హూందాగా వ్యవహరించాలి. అప్పుడే ఆ వ్యవస్థకైనా, ఆ పదవికైనా ప్రజల్లో గౌరవ మర్యాదలుంటాయి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ప్రజల్లో రాజ్యాంగ వ్యవస్థపై కూడా చులక భావన ఏర్పడుతుంది.
ఇప్పుడు నిమ్మగడ్డ రమేశ్ వ్యవహార తీరు వల్ల రాజ్యాంగ వ్యవస్థనే జనం లెక్కచేయని పరిస్థితి ఏర్పడింది. పెద్ద పదవిలో ఉండడం ముఖ్యం కాదు …పెద్ద మనసుతో ఆలోచించాలి. నిమ్మగడ్డ వ్యవహార శైలి చూస్తుంటే … అప్రయత్నంగానే కనకపు సింహాసనం మీద అనే పద్యం గుర్తుకు వస్తోంది.
పైగా తమ వైపు నుంచి పొరపాటు జరిగిందని ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వెళ్లినా … దాన్ని పాజిటివ్‌గా రిసీవ్ చేసుకోలేదంటే నిమ్మగడ్డ నైజం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తాను గట్టిగా బదులిచ్చే సరికి పొరపాటైందని చెబుతు న్నారని రమేశ్‌కుమార్ అభిప్రాయపడినట్టు ఎన్నికల కమిషనర్ వర్గాలు మీడియాకు వెళ్లడించడం గమనార్హం. రాజ్యాంగం చేసుకున్న పాపం ఏంటో తెలియదు కానీ …నిమ్మగడ్డ లాంటి వాళ్లను భరించాల్సి వస్తోంది.