ఏక్.. దో.. తీన్.. చార్.. టాలీవుడ్ టాప్ గేర్

చూస్తుంటే.. కరోనా మన తెలుగు హీరోల మైండ్ సెట్ ను పూర్తిగా మార్చేసినట్టుంది. నితిన్, నాగచైతన్య లాంటి హీరోలు వరుసగా సినిమాలు చేస్తుంటారు. కానీ పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి హీరోలు కూడా ఇప్పుడు…

చూస్తుంటే.. కరోనా మన తెలుగు హీరోల మైండ్ సెట్ ను పూర్తిగా మార్చేసినట్టుంది. నితిన్, నాగచైతన్య లాంటి హీరోలు వరుసగా సినిమాలు చేస్తుంటారు. కానీ పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి హీరోలు కూడా ఇప్పుడు నాలుగేసి సినిమాలు లైన్లో పెట్టడం విడ్డూరం. అవి కూడా ఊహాగానాలు కావు. పక్కాగా లాక్ చేసిన ప్రాజెక్టులు. అలా ఈ సీజన్ లో నాలుగేసి సినిమాలు చేస్తున్న హీరోల లిస్ట్ ఓసారి చూద్దాం

పవన్ కల్యాణ్ చేతిలో 4 సినిమాలున్నాయి. ప్రస్తుతం వకీల్ సాబ్ చేస్తున్నాడు. సైమల్టేనియస్ గా క్రిష్ దర్శకత్వంలో సినిమా నడుస్తోంది. ఆ వెంటనే హరీశ్ శంకర్ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక నాలుగో సినిమాగా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లేదా రామ్ తళ్లూరి-సురేందర్ రెడ్డి ప్రాజెక్టు మొదలయ్యే ఛాన్స్ ఉంది. అలా వచ్చే ఎన్నికల్లోపు 4 సినిమాలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టున్నాడు పవన్.

అటు ప్రభాస్ చేతిలో కూడా 4 సినిమాలున్నాయి. ప్రస్తుతం రాధేశ్యామ్ చేస్తున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరోవైపు నాగఅశ్విన్ దర్శకత్వంలో సైన్స్-ఫిక్షన్ సినిమాకు కూడా ఓకే చేశాడు. ఇక ఈ సీజన్ లో నాలుగో సినిమాగా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై మరో పాన్-ఇండియా సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించి ప్రకటన త్వరలోనే రాబోతోంది.

శర్వానంద్ కూడా 4 సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకారం సెట్స్ పై ఉంది. తెలుగు-తమిళ భాషల్లో చేస్తున్న ఓ బై-లింగ్వుల్ సినిమా కూడా సెట్స్ పై ఉంది. త్వరలోనే అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా చేయబోతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా ఓ సినిమా లైన్లో పెట్టాడు.

ఇక నితిన్ 4 సినిమాల గురించి అందరికీ తెలిసిందే. రంగ్ దే చేస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో 'చెక్' చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంథాధూన్ రీమేక్ చేయబోతున్నాడు. దీంతో పాటు కృష్ణచైతన్య దర్శకత్వంలో పవర్ పేట ప్రాజెక్టు ఉండనే ఉంది.

అటు నిఖిల్, నాగచైతన్య చేతిలో కూడా నాలుగేసి ప్రాజెక్టులున్నాయి. తాజాగా 18-పేజెస్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు నిఖిల్. త్వరలోనే కార్తికేయ-2 కూడా స్టార్ట్ కాబోతోంది. ఇక సునీల్ నారంగ్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశాడు. ఈ 3 సినిమాలతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో లేదా గీతాఆర్ట్స్-2 బ్యానర్ పైనే మరో సినిమా చేయబోతున్నాడు నిఖిల్.

ఇక నాగచైతన్య కూడా వరుసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం చైతూ చేతిలో లవ్ స్టోరీ సినిమా ఉంది. రేపోమాపో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక పరశురామ్ దర్శకత్వంలో నాగేశ్వరరావు ప్రాజెక్టు ఆల్రెడీ లాక్ అయి ఉంది. ఈ గ్యాప్ లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇలా టాలీవుడ్ లో చాలామంది హీరోలు మరో రెండేళ్లకు సరిపడ సినిమాల్ని ముందుగానే రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. ఓ సినిమా పూర్తయితే తప్ప మరో సినిమా ప్రకటించని పవన్, ప్రభాస్ లాంటి హీరోలు కూడా ఇలా నాలుగేసి సినిమాలు లైన్లో పెట్టడం విచిత్రం కాక ఇంకేంటి.

దుబ్బాకలో రూపాయి ఖర్చు పెట్టకుండా గెలుస్తా