సంక్రాంతి సిత్రాలు..ఏవో వస్తాయనుకుంటే ఇంకేవో…

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుందని అనుకున్నారంతా. ఓవైపు ఆర్ఆర్ఆర్, వారం గ్యాప్ లో రాధేశ్యామ్ కలెక్షన్లు కమ్మేస్తాయని అంచనాలు కట్టారు. దీనికి కొన్ని రోజుల ముందు భీమ్లానాయక్ కూడా రేసులో ఉండడంతో ఈ సంక్రాంతి…

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుందని అనుకున్నారంతా. ఓవైపు ఆర్ఆర్ఆర్, వారం గ్యాప్ లో రాధేశ్యామ్ కలెక్షన్లు కమ్మేస్తాయని అంచనాలు కట్టారు. దీనికి కొన్ని రోజుల ముందు భీమ్లానాయక్ కూడా రేసులో ఉండడంతో ఈ సంక్రాంతి మరింత రంజుగా మారనుందంటూ కథనాలు వచ్చాయి. కట్ చేస్తే, సంక్రాంతికి సరిగ్గా 10 రోజుల ముందు అసలు స్వరూపం బయటపడింది. ఏవో వస్తాయనుకుంటే, ఇంకేవో సినిమాలు లైన్లోకి వచ్చాయి.

ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది. భీమ్లానాయక్ దానికంటే ముందే వాయిదా పడింది. రాధేశ్యామ్ వాయిదా పడ్డానికి సిద్ధంగా ఉంది. అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలింది. దీంతో ఈ సంక్రాంతికి ఊహించని సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఉదాహరణకు రౌడీ బాయ్స్ నే తీసుకుందాం. దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఆశిష్ (శిరీష్ కొడుకు)ను హీరోను పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ఇది. ఎప్పుడో షూటింగ్ అయింది. 2 విడతలుగా ప్రచారం కూడా చేసి ఆపేశారు. ఇప్పుడు సడెన్ గా  సంక్రాంతి రిలీజ్ అంటూ సినిమాను తెరపైకి తెచ్చారు.

ఇదే అనుకుంటే, ఊహించని విధంగా హీరో అనే సినిమా కూడా తెరపైకొచ్చింది. అశోక్ గల్లా హీరోగా పరిచయమౌతున్న సినిమా ఇది. జనవరి 15న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇది మాత్రమే కాదు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన డీజే టిల్లూ అనే సినిమా కూడా సంక్రాంతికే వస్తోంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలతో పాటు డిసెంబర్ 31న రిలీజ్ కావాల్సిన రానా సినిమా 1945ను కూడా వాయిదావేసి, సంక్రాంతికి షెడ్యూల్ చేశారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అయిన జనవరి 7న ఆ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఇక నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేయబోతున్నట్టు నిన్న రిలీజైన టీజర్ తో ప్రకటించేశారు.

ఇలా ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, రాధేశ్యామ్ సినిమాలు వస్తాయనుకుంటే.. డీజే టిల్లూ, రౌడీబాయ్స్, హీరో లాంటి సినిమాలు క్యూ కట్టాయి. ఈ సంక్రాంతికి కాస్త క్రేజ్ ఉన్న సినిమా బంగార్రాజు మాత్రమే. అది కూడా వస్తుందా.. ఆఖరి నిమిషంలో వాయిదా పడుతుందా అనే విషయం కరోనా/లాక్ డౌన్ పై ఆధారపడి ఉంది.