మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాటలకు అర్థాలే వేరు. ఆయన ఔనంటే కాదని, కాదంటే ఔనని అర్థం చేసుకోవాలి. తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిగా నమ్మించే చతురత చంద్రబాబు సొంతం. రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఆయన వ్యూహాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. అయితే నిజానిజాలు మాత్రం జనం ఎప్పటికప్పుడు గ్రహిస్తున్నారు. ఇదే చంద్రబాబుకు సమస్యగా మారింది.
అంతా ఇంటర్‌నెట్ యుగం. అందరిలోనూ రాజకీయ చైతన్యం పెరిగింది. సామాజిక చైతన్యం రాజకీయ నేతలకు కంటగింపే. అందుకే చంద్రబాబు తరచూ ఇరిటేట్ అవుతుంటారు. రానున్న ఎన్నికల్లో పొత్తులపై మీడియా ప్రశ్నిస్తే…చంద్రబాబు కాసింత ఇబ్బందికి గురి అయ్యారు.
కొత్త సంవత్సర వేడుక సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పంథాపై ఆచితూచి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోందని, మీరేమంటారని చంద్రబాబును ప్రశ్నించగా…ఆయన ఉత్సాహంగా సమాధానం ఇచ్చారు.
‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మా పార్టీ సిద్ధంగా ఉంటుంది. ముందస్తుపై ప్రచారం జరుగుతోంది. తెలంగాణతోపాటు ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు. ఎప్పుడు వచ్చినా మేం రెడీ’ అని చంద్రబాబు అన్నారు. ఇదే సందర్భంలో జనసేన, బీజేపీలతో పొత్తులపై చంద్రబాబును మీడియా ప్రశ్నించింది. ఈ విషయంలో మాత్రం మీడియాను చంద్రబాబు నిరాశ పరిచారు. ఊహాతీత ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేమని అన్నారు.
‘పొత్తులకన్నా ప్రజల్లో పార్టీని బలోపేతం చేసుకోవడం ముఖ్యం. పొత్తులు ఉన్నా ఒకోసారి ఓడిపోయాం. పొత్తులు లేకపోయినా ఒకోసారి గెలిచాం. అప్పటి పరిస్థితులను బట్టి పొత్తులపై ఆలోచిస్తాం’ అని బాబు బదులిచ్చారు. జనసేన, వామపక్షాలతో కలిసి పొత్తులో భాగంగా వైసీపీతో తలపడతామని టీడీపీ సీనియర్ నేత, శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనను ఇటు టీడీపీ, అటు జనసేన ఖండించకపోవడం గమనార్హం.
జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంటే తప్ప వైసీపీని ఎదుర్కోలేమని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే బీజేపీ ఛీ కొడుతున్నా టీడీపీ ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు జనసేనతో కూడా అదే వైఖరి. అసలు ముందస్తు ఎన్నికల మాటే లేని విషయంలో మాత్రం తాను విన్నట్టు, సిద్ధంగా ఉన్నట్టు బాబు ప్రకటించడం గమనార్హం. ఇదే పొత్తుల గురించి బహిరంగంగా సొంత పార్టీ నేతలు మాట్లాడుతున్నా…ఏమీ తెలియనట్టు ఊహాతీతమంటూ కొట్టి పారేయడం చంద్రబాబుకే చెల్లింది.
ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయని పార్టీ శ్రేణులకు చెబుతూ, అధికారానికి రాబోతున్నామని ఆశ పెట్టేందుకు మాత్రం అబద్ధాన్ని బాబు ఆశ్రయించారు. ఇదే పొత్తులపై విస్తృతంగా చర్చ జరుగుతున్నా..ఎక్కడ తనకు నష్టం కలిగిస్తుందోనని దాచి పెట్టేందుకు ప్రయత్నించడం బాబు నైజాన్ని కళ్లకు కడుతోందని చెప్పొచ్చు.