రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. కరోనా ఏమీ లేనప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి, ఇప్పుడు దాని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు జరిపించాలని తహతహలాడుతున్న నిమ్మగడ్డపై మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీకొండాలమ్మ దేవస్థానంలో శనివారం కుటుంబ సమేతంగా నవరాత్రి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తాను చెప్పిందే వేదం అన్నట్టు నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇది సరైన వైఖరి కాదన్నారు. మరో కొన్ని నెలలు మాత్రమే నిమ్మగడ్డ తన పదవిలో కొనసాగుతారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ముఖ్యమన్నారు. అంతా తనిష్టం వచ్చినట్టు చేస్తానని, తాను చెప్పిందే రాజ్యాంగమని నిమ్మగడ్డ అనుకుంటే కుదరదని కొడాలి నాని తేల్చి చెప్పారు.
ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఏమీ చేయలేరని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని, అలా కాకుండా తానే నిర్వహిస్తానని ఎన్నికల సంఘం అనుకుంటే జరిగే పని కాదన్నారు.
కరోనా మహమ్మారి వల్ల ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఎవరూ వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే ఆలోచన ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
దసరా తర్వాత కరోనా ఉధృతమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఆ హెచ్చరికలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని కొడాలి నాని తెలిపారు. బీహర్ అసెంబ్లీ ఎన్నికలతో స్థానిక సంస్థలను పోల్చకూడదని ఒక ప్రశ్నకు కొడాలి నాని సమాధానమిచ్చారు.