కనికట్టు విద్యలో చంద్రబాబునాయుడు, ఆయనకు వంత పాడే ఎల్లో మీడియా బాగా ఆరితేరాయి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం లేదా రాయడం వాళ్ల ఇంటావంటా లేవనే చెప్పాలి. అసలు విషయాన్ని పక్కన పెట్టి, కొసరు పట్టుకుని జనాన్ని మభ్య పెట్టడంలో చంద్రబాబు, ఆయనకు జాకీలు వేసి లేపే ఎల్లో మీడియా చాలా ఏళ్లు విజయవంతమయ్యాయి. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని వాళ్ల వాదనలోని డొల్లతనం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది.
తాజాగా విశాఖపట్నంలో గీతం విశ్వవిద్యాలయం నిర్మాణాల కూల్చివేతను చంద్రబాబు, ఎల్లో మీడియా తప్పుదారి పట్టించాలనే ప్రయత్నాలు వికటించాయి. గీతం విశ్వవిద్యాలయానికి సంబంధించి కూల్చివేతలపై నిజాలను దాచాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆ కూల్చివేతలపై చంద్రబాబు మాటలను, ఈనాడు, ఆంధ్రజ్యోతి కనికట్టు రాతలను ఒకసారి పరిశీలిద్దాం.
“గీతం విశ్వవిద్యాలయ నిర్మాణాల కూల్చివేత”…ఈ శీర్షికతో ఈనాడు వెబ్‌పేజీలో కనిపించిన వార్త. మామూలుగా చూస్తే ఇందులో ఏ తప్పూ కనిపించదు. కానీ ఇక్కడే ఈనాడు టక్కుటమార గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాలాది విద్య దాగి ఉంది. ఈ శీర్షిక చదవగానే జగన్ సర్కార్ అన్యాయంగా టీడీపీ నేతకు సంబంధించిన విశ్వవిద్యాలయ భవనాల కూల్చివేతకు పాల్పడుతోందనే భావన కలుగుతుంది.
ఇలాంటి నెగెటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేయడమే ఈనాడు లక్ష్యం. ఎందుకంటే ఈ గీతం విశ్వవిద్యాలయం హిందూపురం ఎమ్మెల్యే, చంద్రబాబు బామ్మర్ది నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌కు సంబంధించింది. బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఇక ఈనాడు వార్త విషయానికి వస్తే …”గీతం విశ్వవిద్యాలయ నిర్మాణాల కూల్చివేత”లో నిర్మాణాలకు ముందు “అక్రమ” అని చేర్చి ఉండాలి. ఈ ఒక్క పదం చేర్చకపోవడంలోనే ఉంది ఈనాడు చతురత. ఇక కథనంలో కూడా ఎక్కడా అక్రమ నిర్మాణాలనే మాటే లేకుండా ఎంతో జాగ్రత్త తీసుకోవడం కనిపిస్తుంది. ఈనాడు వార్త ఎలా సాగిందో చూద్దాం.
“విశాఖ గీతం యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. వర్సిటీ ప్రధాన ద్వారం, ప్రహరీగోడతో పాటు సెక్యూరిటీ రూమ్‌లను పడగొట్టారు. పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీ, బుల్‌డోజర్లతో కూల్చివేత చేపట్టారు” …ఇదంతా ఈనాడు అభిప్రాయం. ఇదే కథనంలో గీతం కూల్చివేతలపై విశాఖ ఆర్డీవో పెంచలకిశోర్ వివరణ ఇచ్చారు. అదేంటో తెలుసుకుందాం.
“గీతం వర్సిటీకి చెందిన 40 ఎకరాల భూమి ఆక్రమణలో ఉంది. దీనికి సంబంధించి వర్సిటీ యాజమాన్యం సంప్రదింపులు జరిపింది. ప్రభుత్వ విధానం మేరకు ఆక్రమణల తొలగింపు చేపట్టాం. ఆక్రమణలో ఉన్న భవనాలను కూల్చి వేస్తున్నాం” అని ఆర్డీఓ పెంచలకిశోర్ స్పష్టం చేశారు. అసలు సంగతేంటో ఆర్డీవో వివరణతో అర్థం చేసుకోవచ్చు. కానీ అక్రమ నిర్మాణాలని మాత్రం ఈనాడు రాసేందుకు ససేమిరా అంటోంది.
గీతం విశ్వవిద్యాలయ భవనాల కూల్చివేతపై చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను క్యారీ చేసే క్రమంలో ఆంధ్రజ్యోతి లీడ్ వాక్యం రాసిన విధానం చూస్తే ….ఎల్లో మీడియా తన వాళ్ల అక్రమాలను మూసిపెట్టడంలో ఎంత బాగా శిక్షణ పొందాయో అర్థం చేసుకోవచ్చు. “గీతం వర్సిటీ కూల్చివేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు” …అని ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. ఇక్కడ కూడా పొరపాటున కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేత అనే పదమే రాయలేదు.
అలాగే చంద్రబాబు స్పందన ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
‘ఎంతోమంది విద్యార్ధుల చదువులకు, యువత ఉపాధికి, రోగుల వైద్యానికి దోహదపడుతోన్న విశాఖలోని అత్యున్నత 'గీతం' విద్యాసంస్థల కూల్చివేతలను ఖండిస్తున్నాను. మొన్న మాజీ మేయర్ సబ్బం హరి ఇంటిపై విధ్వంసం, నేడు గీతం వర్సిటీలో విధ్వంసం కక్ష సాధింపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇక్కడి హింసా విధ్వంసాలను చూసి ‘బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా’ అనుకుంటూ అనేక కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.
కరోనా కాలంలో సామాజిక బాధ్యతగా కోట్ల రూపాయల నష్టాన్ని భరించి 2590 మంది కోవిడ్ పేషంట్లకు చికిత్స అందించింది గీతం సంస్థ. అలాంటి ఆదర్శవంతమైన సరస్వతీ నిలయాన్ని అర్ధరాత్రి 200 మందితో వెళ్ళి కూల్చడం దారుణం. కట్టడం చేతగానివాళ్లకు కూల్చే హక్కులేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు గర్వకారణమైన గీతం సంస్థలపై రాజకీయ కక్షసాధింపు మరో తుగ్లక్ చర్య’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు తన ట్వీట్‌లో ఎక్కడా కూడా కూల్చివేతకు కారణమైన అక్రమాల గురించి ప్రస్తావించలేదు. పైగా అత్యున్నత విద్యాసంస్థలంటూ ప్రశంసించారు. సబ్బం హరి ఇంటితో పోల్చడం ద్వారా గీతం వర్సిటీ కూడా అక్రమాలకు పాల్పడిందని పరోక్షంగా చెప్పినట్టైంది.
తన పాలనలో అక్రమాలకు తెరలేపిందే కాకుండా, ఇప్పుడు వాటిని అరికడుతుంటే విమర్శించడం బాబుకే చెల్లింది. అత్యున్నత విద్యాసంస్థలకేమైనా ఆక్రమించుకోవచ్చనే వెసలుబాటు చట్టంలో ఉందేమోనని బాబు ట్వీట్ చూస్తే అనుమానం కలుగుతోంది.