బహుశా నిర్భయ కూడా ముఖేష్ సింగ్ ను వేడుకుని ఉండవచ్చు. తనను వదిలేమయని, దారుణానికి ఒడికట్టవద్దని నిర్భయ కూడా ఆ నరహంతకులను వేడుకుని ఉండవచ్చు. వదిలేయమని ప్రాధేయపడి ఉండవచ్చు. అయితే నిర్భయ మీద ఆ నరరూప మృగాలు ఏ మాత్రం జాలి చూపలేదు. అత్యాచారం చేశాకా కూడా వారిలో పశుత్వం తగ్గలేదు. అత్యంత దారుణంగా ఆమెను హింసించారు. ఒకడు కాదు ఇద్దరు కాదు..అంతమంది పశువులు కూడా చీదరించుకునేలా ఆమెతో అత్యంత కృతకంగా వ్యవహరించారు.
ఇప్పుడు ఆ దుర్మార్గులకు శిక్ష అమలయ్యే సమయం వచ్చింది. ఆ సందర్భంగా కోర్టులో భావోద్వేగమైన పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిర్భయ హంతకుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ అనే వాడి తల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు గట్టిగా ఏడ్చినట్టుగా సమాచారం. తన తనయుడిని క్షమించి వదిలేయాలని ఆమె కోర్టులో రోదించినట్టుగా తెలుస్తోంది. అయితే న్యాయమూర్తి ఆమెను బయటకు తీసుకెళ్లమని ఆదేశించి, జైల్లో ఉన్న దోషులతో మాట్లాడారు. వారికి డెత్ వారెంట్ ను చదివి వినిపించారు న్యాయమూర్తి.
వారు ఏ ఘాతుకానికి పాల్పడ్డారు, ఎంత ఘాతుకానికి పాల్పడ్డారు.. దానికి ఎలాంటి శిక్ష పడుతోందో.. న్యాయమూర్తి వాళ్లకు వివరించారు. ఆ తర్వాత ముకేష్ సింగ్ తల్లి నిర్భయ తల్లి దగ్గరకు వెళ్లి రోదిస్తూ వేడుకున్నట్టుగా సమాచారం. తన తనయుడిని క్షమించి వదిలిపెట్టమని ఆమెను వేడుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక తల్లిగా ఆమె ఆవేదన చెందుతూ ఉండవచ్చు. అయితే తన పుత్రరత్నం ఎంత ఘనకార్యానికి పాల్పడ్డాడో ఆమెకు తెలియదని అనుకోలేం.
అంత ఘాతుకానికి పాల్పడిన తన తనయుడికి శిక్ష పడుతూ ఉంటే.. ఆమెకు అంత బాధ కలుగుతూ ఉంటే, అభంశుభం తెలియని నిర్భయ జీవితం అంత విషాందాంతం అయినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఎంత కడుపుకోతకు గురి అయ్యుంటారో ఈ ముకేష్ సింగ్ తల్లి కూడా మాతృత్వ తపనతోనే ఆలోచించాలి. అంత చేశాకా.. మళ్లీ తాము పేదవాళ్ల అయినందునే తమ వాళ్లను ఈ కేసులో ఇరికించారంటూ.. మీడియా ముందుకు వచ్చి హల్చల్ చేసిందట ముకేష్ తల్లి!