పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఒక్క టాలీవుడ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో సినీ నటులు తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసోంలో అక్కడి సినీ పరిశ్రమ ఉద్యమకారులకు సంఘీభావం తెలిపింది. ఉద్యమంలో సినీ కళాకారులు పాల్గొని మోడీ సర్కార్ నియంతృత్వ పోకడలపై విరుచుకుపడ్డారు.
ప్రముఖ హీరో కమల్‌హాసన్ కూడా ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. నిన్న బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా ఘాటుగా స్పందించారు. భారత్‌లో విద్యార్థుల కంటే ఆవులకే రక్షణ ఎక్కువని ట్వీట్ చేసి నిరసన వ్యక్తం చేశారు.
కానీ మన తెలుగు సినీ పరిశ్రమ మాత్రం ఈ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేనట్టు వ్యవహరిస్తోంది. ఇంకా చెప్పాలంటే పాలకులను పొగడ్తలతో ముంచెత్తేందుకు మాత్రమే వీరు పనికొస్తారనే విమర్శలు లేకపోలేదు. రెండు రోజుల క్రితం ఢిల్లీ జవహార్‌లాల్ నెహ్రూ యూనిర్సిటీలో ముష్కరులు రాడ్లు, యాసిడ్, ఆయుధాలతో విద్యార్థులు, టీచర్లపై దాడి చేశారు. రెండు గంటల పాటు అల్లకల్లోలం సృష్టించారు. ఈ దాడిలో జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ సహా మరో 30 మంది విద్యార్థులు, టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై కలత చెందిన బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనె జేఎన్‌యూకు వెళ్లారు. క్యాంపస్‌లో ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఆమె వర్సిటీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులను పరామర్శించారు.
క్యాంపస్‌లో దాడికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ఆమె మద్దతు తెలిపారు. నిరసన దీక్షలో విద్యార్థులతో పాటు ఆమె కూర్చున్నారు.
కానీ మన తెలుగు హీరోలు, హీరోయిన్‌లు మాత్రం నోరు తెరవడం లేదు. ఎంతసేపూ షూటింగ్‌లు, కలెక్షన్లపైన్నే శద్ధ. తమను అభిమానించే వారి కోసం వీరు ఏమీ చేయరా? ప‌్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే పవన్‌కల్యాణ్ సైతం జేఎన్‌యూ ఘటన, పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై నోరు మెదపకపోవడం విచారకరం