రామోజీరావు నేతృత్వంలో నడుస్తున్న ఈనాడు పత్రిక దళితులను చిన్న చూపు చూస్తోంది. కారంచేడులో దళితుల ఊచకోతకు సంబంధించిన వార్తను లోపలి పేజీలో కనిపించీ కనిపించకుండా వేసిన ఆ పత్రికకు … దళితులంటే గౌరవం ఉంటుందని ఎవరూ భావించరు. అయితే కాలానికి అనుగుణంగా మనుషులైనా, వ్యవస్థలైనా తప్పక మారాల్సిందే. ఒక వేళ తాము మారేది లేదని ఎవరైనా భీష్మించుకు కూర్చుంటే పతనం తప్పదు. ఇది కాలం , చరిత్ర చెబుతున్న పచ్చి నిజం.
దళితుల విషయంలో కారంచేడు నాటి రోజులకు, ప్రస్తుత కాల పరిస్థితుల నేపథ్యంలో ఈనాడులో ఏ మాత్రం మార్పు రానట్టే. దీనికి నిలువెత్తు సాక్ష్యంగా నేడు ఈనాడులో “వికేంద్రీకరణకు మద్దతుగా ఆటల్లో తరలింపు” శీర్షికతో ప్రచురించిన వార్తను చెప్పు కోవచ్చు.
ఈ వార్తా కథనంలో రాసిన ఓ వాక్యం గురించి ముందుగా తెలుసుకుందాం. “పాలనా వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతుగా ఏపీ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతిలోని మందడం గ్రామానికి సమీపంలో కొన్ని రోజులుగా దీక్షా శిబిరం నిర్వహిస్తున్నారు” అని స్వయంగా ఈనాడు రాసింది.
దాదాపు నెల రోజులుగా వికేంద్రీకరణకు మద్దతుగా, అలాగే రాజధాని ప్రాంతంలో తమకు ఇంటి స్థలాలు ఇవ్వాలనే డిమాండ్‌తో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ముఖ్యంగా దళితులు, ఇతర అణగారిన వర్గాలు దీక్షా శిబిరం నిర్వహిస్తుంటే …కనీసం ఒక్కరోజైనా వార్త ఇవ్వాలనే ఆలోచన, స్పృహ ఈనాడుకు ఎందుకు రాలేదు? దళితుల పట్ల చిన్న చూపునకు ఇంత కంటే ఉదాహరణ ఏం కావాలి? ,
ఇదే రాజధాని ప్రాంత రైతులు 311 రోజులుగా ఉద్యమం సాగిస్తున్నారని ప్రతిరోజూ ఫొటోతో సహా వార్త ప్రచురించడం లేదా? అసలు రైతుల కంటే పచ్చ మీడియా చేస్తున్న ఉద్యమమే ఎక్కువనే అభిప్రాయాలు లేవా?
పోనీ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరం గురించి పాజిటివ్ వార్త ఇవ్వకపోగా … పేదల ఉద్యమాన్ని అవహేళన చేస్తూ , అక్కడికి ఆటోల్లో తరలిస్తున్నారని చెప్పడం దేనికి సంకేతం? ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవమానపరచడం కాదా? అంటే కార్లలో వెళ్లే వాళ్లే ఉద్యమకారులా? ఆటోల్లోనూ, నడిచిపోయే వాళ్లు ఉద్యమకారులు కాదా?
కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని వాళ్లు ఆటోల్లో కాకుండా మరే వాహనాల్లో వెళ్లాలో ఈనాడు, అమరావతి ఉద్యమకారులే సెలవిస్తే మంచిది. అయినా పాలనా వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతు తెలిపేందుకు ఇతర ప్రాంతాల వాళ్లు వెళితే తప్పేంటి? అమరావతి ఉద్యమానికి దేశ, విదేశాల నుంచి మద్దతు లభిస్తోందని గొప్పగా ప్రచారం చేసుకోవడం లేదా? అలాంటిది రాజధాని ప్రాంతంలోనే వికేంద్రీకరణ నిర్ణయానికి బహుజనులు దీక్షా శిబిరం నిర్వహిస్తుంటే …ఓర్వలేకపోవడం ఏంటి?
ఏం బహుజనులకు సొంత అభిప్రాయాలు ఉండకూడదా? తమకు ఇంటి స్థలాలు కావాలని అడగడం కూడా నేరమా? వికేంద్రీకరణకు మద్దతుగా ఆందోళన చేస్తే పెయిడ్ ఆర్టిస్టులని కించపరచడం బాబు సామాజిక వర్గ అహంకారం కాదా? తాము చేస్తే మాత్రం ఉద్యమమా? ఇదెక్కడి నీతి, రీతి?
ఇలాంటి అప్రజాస్వామిక ధోరణుల వల్లే తమ ఉద్యమానికి మద్దతు కొరవడిందని రాజధాని ఉద్యమకారులు గుర్తిస్తే మంచిది. పాలనా వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతుగా నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వద్దకు వెళుతున్న వాళ్లను అడ్డుకోవడాన్ని సంబరంగా ప్రచురించిన ఈనాడు నిజ స్వరూపం ఏంటో ఈ ఒక్క వార్తా కథనమే ప్రతిబింబిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.