తెలుగుదేశం పార్టీలో ముచ్చట పడి చాలా మందికి పదవులు చంద్రబాబు పంచేశారు అఫ్ కోర్స్ ఇవన్నీ పార్టీ పదవులు అనుకోండి. అంటే జనాలోకి వెళ్ళి చేతి చమురు వదుల్చుకునే పదవులు అన్న మాట. ఈ పదవులు ముందు పెట్టి అధికారం కోసం పోరాటం చేయాలి. తీరా పవర్లోకి వచ్చాక జెండా మోసిన వారు గుర్తుంటారా అంటే అది వేరే సంగతి మరి.
ఇంతకీ పదవుల పందేరం అయిపోయింది కదా తమ్ముళ్ళూ చెల్లెళ్ళు మొత్తానికి మొత్తం సెట్ అయినట్లేనా. వారంతా కలసి జనంలోకి వెళ్ళి పార్టీని పటిష్టం చేస్తారా అంటే అక్కడే ఉంది అసలు కధ అని అంతా అంటున్నారు.
చాలా మందికి ఇచ్చిన పదవులు హోదాకు సరిపోలేదట. మరికొందరికి ఒకటి చెప్పి మరొక పదవి ఇచ్చారట. ఇలా తమ్ముళ్ళే కాదు, చెల్లెమ్మలూ కుములుతున్నట్లుగా పార్టీలో టాక్.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతికి జాతీయ ఉపాధ్యక్షురాలు పేరిట పదవి ఇచ్చారు. ఆమె ఇప్పటిదాకా పొలిటి బ్యూరో సభ్యురాలు. ఇపుడు కొత్త పదవితో తనకు దక్కిన విలువ, గౌరవం ఏంటి అని ఆమె ఆవేదన చెందుతున్నారుట.
అందుకే తనకు ఈ పదవి వద్దు అంటూ ఆమె అధినాయకత్వానికి లేఖ రాసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక ఇదే జిల్లాకు చెందిన బీసీ కుల భూషణుడు గౌతు లచ్చన్న మనవరాలు శిరీషకు కూడా సరైన గౌరవం దక్కలేదని ఆవేదన చెందుతున్నారని మరో టాక్.
మిగిలిన జిల్లాల్లో కూడా సేమ్ టూ సేమ్తమ్ముళ్ళు, చెల్లెళ్ళూ సణుగుతున్నారని అంటున్నారు. మాకొద్దీ పదవులు అని కొందరు అంటున్నారుట. మొత్తానికి చూస్తే ఈ గొడవలను టీడీపీ పెద్దలు ఎలా చల్లారుస్తారో ఏమో చూడాలి మరి.