జోకులు లోకేష్ కు కొత్త కాదు. ట్విట్టర్ వేదికగా ఆయన పేల్చినన్ని జోకులు మరే రాజకీయ నాయకుడు వేసి ఉండడు. అయితే ఇప్పటివరకు చినబాబు చేసిన కామెడీ ఒకెత్తు. ఈరోజు చేసిన కామెడీ అల్టిమేట్. తన కెరీర్ లోనే అతిపెద్ద జోక్ ఈరోజు వేశారు లోకేష్. అదేంటో తెలుసా.. ఈయనగారు రైతు ఉద్యమం మొదలుపెడతారట.
ఆనాడు వ్యవసాయం దండగ అన్నందుకు చంద్రబాబుకి కర్రుకాల్చి వాత పెట్టారు రైతులు. 2014లో గద్దెనెక్కాక రైతు రుణమాఫీని గాలికొదిలేసి, మరోసారి మోసం చేయడం వల్లే 2019లో చిత్తుచిత్తుగా ఓడించారు. ఈ రెండు ఉదాహరణలతో పెదబాబుకి బాగా జ్ఞానోదయం అయినట్టుంది.
అందుకే చినబాబుని పొలాల్లో దించేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఐటీ మంత్రిగా విదేశీ టూర్లతో ఎంజాయ్ చేసిన చినబాబు.. అధికారం పోయాక.. ఇప్పుడు రైతుల విలువ తెలుసుకుని “జపం…జపం..జపం.. రైతు జపం..” అంటూ సాంగేసుకుంటున్నారు.
వరదలతో నష్టపోయిన రైతుల్ని పరామర్శించే నెపంతో ఇటీవల గోదావరి జిల్లాల యాత్ర ముగించుకున్న లోకేష్.. ఈరోజు అనంతపురంలో ల్యాండ్ అయ్యారు. యథాప్రకారం రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శలు మొదలు పెట్టారు.
రాయలసీమ బిడ్డ జగన్.. రైతులు కష్టాలు పడుతుంటే ఎక్కడికి వెళ్లిపోయారని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్ని గాలికి వదిలేశారని, తాను జనాల్లోకి వెళ్లి ఓదారుస్తుంటే.. ఏ అధికారంతో వెళ్తావని ప్రశ్నిస్తున్నారని ఎగిరెగిరి పడ్డారు.
అసలు లోకేష్ ని జనాల్లోకి వెళ్లొద్దని ఎవరన్నారు? కరోనా భయంతో ఇన్నాళ్లూ హైదరాబాద్ లో దాక్కున్న ధైర్యవంతులెవరో లోకేషే చెప్పాలి. లాక్ డౌన్ కష్టకాలంలో ప్రజల్ని పట్టించుకోకుండా పక్కరాష్ట్రం పారిపోయిన లోకేష్, ఇప్పుడు తగుదునమ్మా అని వచ్చి జగన్ కి సలహాలివ్వడాన్ని ఏమనాలి?
అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే.. పొలాల్లో మోటర్లకు మీటర్లు బిగిస్తే.. అనంతపురం కేంద్రంగా తాను రైతు ఉద్యమం మొదలు పెడతానంటూ లోకేష్ జగన్ ని హెచ్చరించటం.
రైతుల కష్టాలు పట్టించుకోని టీడీపీ, రైతులను నిండా ముంచిన టీడీపీ.. ఆధ్వర్యంలో రైతు ఉద్యమం అంటే అది జోక్ కాక ఇంకేంటి? ఊరూరా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, ఏడాదికి 12,500 రూపాయలు రైతు భరోసా కింద అందిస్తున్న జగన్ ని విమర్శించిన లోకేష్ ధైర్యాన్ని నిజంగా మెచ్చుకుని తీరాల్సిందే.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల వల్లే వ్యవసాయ విద్యుత్ కి మీటర్లు బిగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.. కేంద్రాన్ని అడ్డుకోవడం చేతకాక రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది టీడీపీ. కరెంటు బిల్లుకి రైతులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, మీటర్లకు అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే పెడుతుందని చెప్పినా కూడా లోకేష్ లాంటి నాయకులు ఇంకా రైతుల్ని రెచ్చగొట్టడం మానుకోలేదు.
ఇంతకీ లోకేష్ రైతు ఉద్యమం ఎప్పుడు మొదలు పెడతారు? పోనీ లోకేష్ మొదలు పెట్టినా.. ఆయన వెనక నడవడానికి ఎంతమంది రైతులు ముందుకొస్తారు? చూడబోతే లోకేష్ మరోసారి తన కార్యకర్తలకు రైతుల వేషాలు వేయించేలా ఉన్నారు. రాబోయే రోజుల్లో చినబాబు ఆధ్వర్యంలో పసుపు కార్యకర్తలు ఇంకెన్ని వేషాలు వేయాలో?