ఓవైపు అమరావతి అనుకూల, మరోవైపు అమరావతి వ్యతిరేక ఉద్యమాలు రాజధాని ప్రాంతంలో పోటాపోటీగా నడుస్తున్నాయి. ఇప్పటివరకూ అమరావతి ప్రాంతంలో పెట్టుబడిదారుల ఉద్యమం చూశాం, ఇప్పుడు.. అమరావతిలో తమకూ ఇళ్ల స్థలాలు కావాలంటూ పేదలు చేస్తున్న పోరాటం చూస్తున్నాం.
అయితే చంద్రబాబు మాత్రం పేదల పోరుపై విషం చిమ్ముతున్నారు. తన అనుకూల మీడియా ద్వారా రాద్ధాంతం చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ఘర్షణలు సృష్టించడానికి పన్నాగం పన్నారు. అందుకే కృష్ణాయపాలెం వద్ద ఉద్రిక్తత తలెత్తింది.
మూడు రాజధానులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ మందడంలో వికేంద్రీకరణకు అనుకూలంగా జరుగుతున్న దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు మంగళగిరి నుంచి కొందరు మహిళలు బయలుదేరారు. అయితే వీరిని కృష్ణాయపాలెం వద్ద కొంతమంది యువకులు అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలో ఇతర గ్రామస్తులకు పనేంటని వారిపై దాడికి ప్రయత్నించారు, వీరంతా టీడీపీ నేతలేనని తేలింది.
చంద్రబాబు అనుకూల మీడియా ఈ వ్యవహారాన్ని తొక్కి పెట్టాలని చూసింది. అమరావతి స్థానికులపై బైట వ్యక్తులు దౌర్జన్యం చేస్తున్నారంటూ పూర్తిగా అవాస్తవాలు ప్రచారం చేసింది. దీనిపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉద్యమంలో ఆర్టిస్ట్ లు, పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టింది చంద్రబాబేనని గుర్తు చేశారాయన. బడుగు బలహీన వర్గాల వారిని ఆర్టిస్టులు అంటూ చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా విమర్శించడాన్ని ఎంపీ సురేష్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆకలి కేకలతో బడుగు బలహీన వర్గాలు ఉద్యమం చేస్తుంటే, అరగని కేకలతో మరో వర్గం ఉద్యమం చేస్తుందంటూ మండిపడ్డారు.
మొత్తమ్మీద అమరావతి ఉద్యమం ఇప్పుడు అసలు సిసలు ఘట్టానికి చేరుకుందనే విషయం స్పష్టమవుతోంది. అటు అమరావతికి అనుకూలంగా జరుగుతున్న ఉద్యమానికి పోటీగా మూడు రాజధానులకు మద్దతుగా అదే ప్రాంతంలో ఉద్యమం మొదలవడం, నిజంగా సంచలనమే. అయితే ఈ ఉద్యమాన్ని చంద్రబాబు అనుకూల మీడియా పూర్తిగా తొక్కిపెట్టింది.
కేవలం సోషల్ మీడియా ద్వారానే బడుగు బలహీన వర్గాల నిరసన దీక్షలు హైలెట్ అవుతున్నాయి. ఇదే ఊపులో రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమాలు మొదలైతే.. అప్పుడు కథ రసకందాయంలో పడుతుంది.