విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి అతి తెలివి వాద‌న‌.. త‌ర్వాత నోరు పెగ‌ల్లేదు!

యాభై రూపాయ‌ల‌కే చీప్ లిక్క‌ర్.. రాష్ట్ర ఆదాయం పెరిగితే..త‌క్కువ రేటుకు చీప్ లిక్క‌ర్ అంటూ.. సోము వీర్రాజు ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్ జాతీయ స్థాయిలో వైర‌ల్ కాగా, ఆ డ్యామేజ్ నియంత్ర‌ణ కోసం క‌మ‌లం…

యాభై రూపాయ‌ల‌కే చీప్ లిక్క‌ర్.. రాష్ట్ర ఆదాయం పెరిగితే..త‌క్కువ రేటుకు చీప్ లిక్క‌ర్ అంటూ.. సోము వీర్రాజు ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్ జాతీయ స్థాయిలో వైర‌ల్ కాగా, ఆ డ్యామేజ్ నియంత్ర‌ణ కోసం క‌మ‌లం పార్టీ వాళ్లు జిన్నా ట‌వ‌ర్ పేరు మార్పు అంశాన్ని తెర‌పైకి తెచ్చారు.

1999 నుంచి 2004 వ‌ర‌కూ తాము ఏపీలో అధికారంలో భాగ‌స్వామిగా ఉన్న‌ప్పుడు కానీ, 2014 అనంత‌రం ఏపీ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న‌ప్పుడు కానీ.. బీజేపీకి గుంటూరులో జిన్నా ట‌వ‌ర్ గుర్తుకు రాలేదు.  ఉన్న ఫ‌లంగా ఎందుకు గుర్తుకొచ్చింది? అంటే ఇదంతా వీర్రాజు చేసిన డ్యామేజ్ క‌వ‌రేజీ ప్ర‌య‌త్నం.

మ‌రి ఈ డ్యామేజీ క‌వ‌రేజీలో అయినా.. క‌మ‌ల‌నాథులు విజ‌య‌వంతం అయ్యారా అంటే.. ఈ వాద‌న‌లో కూడా పంచ్ లు వేయించుకున్నారు! ప్ర‌శాంతంగా ఉన్న రాష్ట్రంలో మ‌త చిచ్చును రేప‌డానికి తాము వెనుకాడ‌మ‌ని బీజేపీ నేత‌లు ఈ మ్యాట‌ర్ ద్వారా ప్ర‌జ‌ల‌కు క్లారిటీ ఇచ్చారు. జిన్నా సెంట‌ర్ పేరు అలానే ఉన్నా, మార్చినా ప్ర‌జ‌ల‌కు న‌ష్టం లేదు.  అయితే బీజేపీకి కావాల్సిన చిచ్చు మాత్రం ఇలా రేపే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇక జిన్నా సెంట‌ర్ పేరుపై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణేదో పెట్టాలంటూ బీజేపీ నేత విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి డిమాండ్ చేశారు ఒక టీవీ చాన‌ల్ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో. అందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వాద‌న‌తో ఏకీభ‌వించిన ఒక ముస్లిం లీగ్ నేత.. విష్ణుకు మ‌రో సూచ‌న చేశారు. జిన్నా ట‌వ‌ర్ పై రిఫ‌రండం పెట్టాల‌ని, అలాగే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ విషయంలో ప్ర‌జాభిప్రాయం తీసుకోవాల‌ని, దాంతో పాటు ఏపీ కి ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో రిఫ‌రండం పెట్టాల‌ని… మెజారిటీ ప్ర‌జ‌లు ఏం చెబితే అది చేయాలంటూ.. ఆయ‌న విష్ణుకు సూచించారు.

రిఫ‌రండం కేవలం జిన్నా ట‌వ‌ర్ మీదే కాదు.. వైజాగ్ స్టీల్ ప్రైవేటీ క‌ర‌ణ‌, ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాల‌పై కూడా పెట్టండి అనే స‌రికి.. ఈ క‌మ‌లం పార్టీ నేత కిక్కురుమ‌న‌లేక‌పోయారు. ఇవే కాదు.. ప్రజా ప్ర‌యోజ‌నాల‌తో ముడిప‌డి ఉన్న ఏ అంశం మీదా క‌మ‌లం పార్టీ వాళ్లు కిక్కుర‌మ‌నలేరు. ఊర్ల పేర్లు మార్పు, మ‌త రాజ‌కీయం అంటే మాత్రం.. ఎంతైనా మాట్లాడ‌గ‌ల‌రు పాపం!