ఇప్పటికే కర్ణాటకలో థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లపై ఆంక్షలను ప్రకటించగా, ఇప్పుడు తమిళనాడు ఈ జాబితాలోకి చేరింది. తమిళనాట కూడా థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లను సగం కెపాసిటీతో మాత్రమే ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ఆంక్షలను ప్రకటించింది.
ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభణ నేపథ్యంలో.. ఈ అంక్షలను ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. అలాగే పాఠశాలలకు విద్యార్థుల హాజరీని కూడా ప్రభుత్వం నియంత్రించింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి పిల్లలకు భౌతిక తరగతులను ఆపేసింది. జనవరి పదో తేదీ వరకూ ఈ ఆంక్షలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేయడానికి వీల్లేకపోవడంతో.. పది రోజుల పాటు ఆంక్షలను ప్రకటించింది. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి.. నిర్ణయం తీసుకోనున్నట్టుగా ప్రకటించింది.
ఒకవైపు సంక్రాంతికి తెలుగు, తమిళ సినిమాలు విడుదలకు భారీ ఎత్తున సిద్ధం అయ్యాయి. తెలుగులో విడుదల అవుతున్న పెద్ద సినిమాలకు తమిళ అనువాద మార్కెట్ పై కూడా ఆశలున్నాయి. జనవరి తొలి వారం తర్వాతి నుంచినే ఈ సినిమాల హడావుడి మొదలు కానుంది.
ఇంతలో తమిళనాడు ప్రభుత్వం యాభై శాతం కెపాసిటీతో మాత్రమే సినిమా థియేటర్లను రన్ చేయాలనే ప్రకటనతో.. విడుదలకు రెడీ అవుతున్న సినిమాలకు షాక్ తగిలింది. ఇప్పటికే ఢిల్లీలో, బెంగళూరులో ఆంక్షల ఫలితంగా కూడా.. తెలుగు సినిమాలపై ప్రభావం పడనుంది. ప్రత్యేకించి బెంగళూరు తెలుగు సినిమాలకు స్వర్గధామం లాంటిదే. అక్కడ విధించిన షరతుల ఫలితం కూడా తెలుగు సినిమా కలెక్షన్లపై భారీగా పడనుంది. ఇప్పుడు తమిళనాడు కూడా ఈ తరహా జాబితాలోకి చేరింది.